మంచు విష్ణు వ్యక్తిగత సిబ్బంది పందిని వేటాడి తీసుకెళ్తున్న వీడియో వైరల్
మహేశ్వరం, డిసెంబర్ 31: మంచు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడిప్పుడే చల్లబడింది అనుకుంటున్న తరుణంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. నటుడు మోహన్‌బాబు వ్యక్తిగత సిబ్బంది మంచు టౌన్‌షిప్ సమీపంలో అడవి పందిని వేటాడి తాళ్లతో కట్టెలకు కట్టి మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మోహన్‌బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణుకు సంబంధించిన మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా గరిగుట్ట అడివిలో పందిని వేటాడి పట్టుకున్న తరువాత మంచు టౌన్‌షిప్‌లోకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీసులను వివరణ కోరగా పాత వీడియో అని తేల్చారు.
అయినప్పటికీ పందిని మోసుకెళ్తున్న వారు ఎవరు? ఏ సమయంలో ఈ వేట కొనసాగించారు? అనే విషయంపై విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే మరోవైపు వన్య ప్రాణాలను వేటాడొద్దని మంచు మనోజ్ అభ్యతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా గత నెలరోజులుగా జల్‌పల్లి మంచుటౌన్‌షిప్ వేదికగా మంచు ఫ్యామిలీలో వివాదాలు తలెత్తాయి.