ఉచితంగా గుండె ఆపరేషన్
ఖమ్మం, అక్టోబర్ 20 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కృష్ణ, బిందుప్రియ దంపతుల మూడేళ్ల కుమార్తె చిన్నానాటి నుంచే గుండె సమస్యతో బాధపడుతున్నది. ఆ చిన్నారికి సినీ నటుడు సోనూసూద్ అండగా నిలిచారు. ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఆపరేషన్ చేయించలేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన స్పందించి వివరాలు తెలుసుకుని, వారిని ముంబై పిలిపించారు. ఆయనే దగ్గరుండి ముంబైలో ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా హార్ట్ సర్జరీ చేయించారు. ఇందుకోసం రూ.6 లక్షలకు పైగానే ఖర్చు చేసి చిన్నారి ప్రాణాన్ని కాపాడారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నది. సోనూసూద్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.