calender_icon.png 27 December, 2024 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలకు మరో ఛాన్స్

03-11-2024 01:37:42 AM

  1. జలమండలి ఓటీఎస్ గడువు పెంపు
  2. ఈనెల 30వరకు బిల్లులు కట్టేందుకు అవకాశం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి) : జలమండలి పరిధిలో ఏళ్లతరబడి నల్లా, సీవరేజీ బిల్లులు చెల్లించని వినియోగదారుల  బకాయిల వసూలు కోసం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడగించింది. ఈ పథకం గడువును పెంచాలని వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతో ఇటీవల జలమండలి ప్రభుత్వానికి లేఖ రాసింది.

దీంతో ఓటీఎస్ గడువును ప్రభుత్వం నవంబర్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాస్తానికి నల్లాబిల్లుల బకాయిలపై వడ్డీ రాయితి కల్పిస్తూ అక్టోబర్ 5 నుంచి 31వ తేదీ వరకు ప్రభుత్వం ఓటీఎస్ అవకాశం కల్పించగా... గత నెలలో వచ్చిన దసరా, దీపావళి పండుగల కారణంగా ఖర్చులు ఎక్కువై ఎక్కువమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని గుర్తించిన ప్రభుత్వం మరోసారి ఈ అవకాశం కల్పించింది.  

సులభంగా బిల్లుల చెల్లింపు..

ఆలస్యరుసుం, వడ్డీపై రాయితీలు పొందాలనుకునే వినియోగదారులు గడువు పెంచిన విషయాన్ని గుర్తించి నవంబర్ 30లోపు పెండింగ్ బిల్లులను చెల్లించాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. జలమండలి కార్యాలయాల్లోని క్యాష్ కౌంటర్లు, జలమండలి క్యూఆర్‌కోడ్,  ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ యాప్‌లు, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్, బీపీపీఎస్ ద్వారా బిల్లు చెల్లించే అవకాశం కల్పించింది.

వినియోగదారుల బిల్లులు ఎంత ఉన్నాయి, ఎంత రాయితీ వస్తుంది, చెల్లించాల్సిన మొత్తం వివరాలను ఇప్పటికే ఎస్‌ఎంఎస్ ద్వారా వారికి పంపించారు. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేసి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.

వచ్చిన ఆదాయం రూ.49కోట్లు మాత్రమే

గతంలో 2016, 2020లో ప్రభుత్వం ఓటీఎస్‌ను అమలు చేసింది. అదే మాదిరిలో ఇప్పటివరకు పేరుకుపోయిన బకాయిలు వసూలు చేయాలనే ఉద్దేశంతో వినియోగదారులకు వడ్డీ రాయితీ కల్పిస్తూ జలమండలి 2024 అక్టోబర్ నెలలో మరోసారి ఓటీఎస్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జలమండలి పరిధిలో మొత్తం 13.50లక్షల క్యాన్ నంబర్లున్నాయి. వాటిలో ఓటీఎస్ అర్హత కలిగిన క్యాన్ నంబర్లు 7లక్షల 11వేల 30 ఉన్నాయి.

ఈ క్యాన్ నంబర్ల ద్వారా జలమండలికి రూ.1,792కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. అయితే ఓటీఎస్ ద్వారా రూ.1,230కోట్లు రాయితీ కల్పించింది. అయితే అక్టోబర్ 31 నాటికి ఓటీఎస్ పథకాన్ని 70వేల 335 మంది వినియోగదారులు మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. వారి ద్వారా జలమండలికి రూ. 49కోట్ల ఆదాయం వచ్చింది. ఓటీఎస్ ద్వారా ఇప్పటివరకు రూ.17కోట్లను మాఫీ చేశారు.

సద్వినియోగం చేసుకోవాలి 

వినియోగదారుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం మరోసారి ఓటీఎస్ గడువును పెంచింది. అక్టోబర్ నెలలో ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోని వినియోగదారులు నవంబర్‌లో సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న బిల్లును ఒకేసారి చెల్లిస్తే ఆలస్యరుసుం, వడ్డీపై రాయితీ పొందవచ్చు.

 అశోక్‌రెడ్డి, జలమండలి ఎండీ