6న విచారణకు రావాలి
- ఏసీబీ నోటీసులు జారీ
- ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపు
హైదరాబాద్, జనవరి 3(విజయక్రాంతి): ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసు విచారణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పీడ్ పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావును ఏసీబీ విచారణకు పిలిచింది.
ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని శుక్రవారం నోటీసులు జారీచేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మరో వైపు ఈ నెల 7న విచారణకు రావాల్సిందిగా ఈడీ ఇదివరకే కేటీఆర్‌కు నోటీసులిచ్చింది. వరుసగా రెండు రోజుల పాటు ఏసీబీ, ఈడీ కేటీఆర్‌ను విచారించనున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది.
కీలక అంశాలపై ఏసీబీ నజర్
ఫార్ములా ఈ-రేసింగ్ కేసుపై ఏసీబీ ప్రతి అంశాన్ని క్షణ్ణంగా అధ్యయనం చేసినట్లు తెలిసింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు.. కేటీఆర్‌ను ఏ ప్రశ్నలు అడగాలనే దానిపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. అసలు రేసు నిర్వహించాలన్న ఆలోచన ఎవరిది? నిధుల చెల్లింపులో నిబంధనలు పాటించారా? ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నదెవరు? బయటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా రా? ఇలా పలు కోణాల్లో ఏసీబీ దర్యాప్తుచేసి ప్రశ్నావలిని తయారుచేసినట్లు సమాచారం. అలాగే, కేటీఆర్ విచారణ తర్వాత ఏసీబీ మరికొందరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దాన కిషోర్ విచారణ
ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో ఫిర్యాదుదారు అయిన ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌ను ఇప్పటికే ఏసీబీ పలుమార్లు విచారించింది. ఫిర్యాదుదారు కావడంతో.. ఈయన వద్ద ఉన్న స మాచారం మొత్తం ఏసీబీ అధికారులకు అందజేశారు. అలాగే, ఇందు లో మోసం ఎలా జరిగిందో ప్రతి అంశాన్ని కూలంకుశంగా ఏసీబీ అధికారులకు ఆయన వివరించారు. దాన కిషోర్ చెప్పిన వివరాల ఆధారంగానే ఏసీబీ అధికారులు ప్రశ్నా వళిని తయారుచేసినట్లు తెలుస్తోంది.