calender_icon.png 29 March, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మృతదేహం వెలికితీత

26-03-2025 01:11:17 AM

  1. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో.. కుళ్లిన స్థితిలో.. 
  2. ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్‌గా గుర్తింపు 
  3. యూపీలోని స్వగ్రామానికి తరలింపు
  4. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత

నాగర్‌కర్నూల్, మార్చి 25 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల్లో మంగళవారం మరొకరి మృతదేహం లభ్యమైంది. గత నెల 22న జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకోగా రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమించి 16వ రోజున గురుప్రీత్‌సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు.

తాజాగా మంగళవారం తెల్ల వారుజామున టన్నెల్‌లోని డిధూ-1 ప్రాంతంలో మినీ జేసీబీ ద్వారా తవ్వకాలు జరుపుతున్న క్రమంలో మృతదేహం బయటపడింది. ప్రమాదం జరిగి సుమారు 33 రోజులు గడుస్తుడటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. ర్యాట్ హోల్ మైనర్, సింగరేణి బృందాలు  అత్యంత జాగ్రత్తగా మృతదేహాన్ని బయటకితీశాయి.

మృతదేహం మెడలో చైన్, వస్త్రాలు ఆధారంగా ఉత్తరప్రదేశ్‌లోని సాఫీపూర్‌కు చెందిన ప్రాజెక్ట్ ఇంజినీర్ మనోజ్(51)గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు.

ప్రస్తుతం సొరంగంలోని అదే ప్రాం తంలో మరికొంత మంది కార్మికుల ఆనవాళ్లు ఉన్నట్లుగా రెస్క్యూ టీం బృందాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. దీంతో అదే ప్రాంతంలో కడవర్ డాగ్స్ సహాయంతో సర్చింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.

సహాయక చర్యలను నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చిన తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంత కుమారి సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏప్రిల్ 10 వరకు సహాయక చర్యలను కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు.

ఈ నేపథ్యంలో మరుసటి రోజే మృతదేహం బయటపడటంతో సహాయక బృందాల్లో గట్టి నమ్మకం ఏర్పడిందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. మరికొద్ది రోజుల్లోనే మిగిలిన ఆరుగురి కార్మికుల ఆనవాళ్లను గుర్తిస్తామని కలెక్టర్ బాదావత్ సంతోష్ ధీమా వ్యక్తం చేశారు.