calender_icon.png 22 September, 2024 | 2:59 PM

మరోమారు రాజీవ్ స్వగృహ వేలం?

16-09-2024 03:59:19 AM

  1. మిగిలిన ప్లాట్లు, ఖాళీ స్థలాల అమ్మకం  
  2. 3,500 కోట్లు సమీకరించుకోవాలని సర్కార్ ప్లాన్ 
  3. అసంపూర్తి ఇళ్లు ఉన్నవి ఉన్నట్లుగానే విక్రయం 
  4. సర్కార్ వద్ద 135 ఎకరాల భూమి.. 1,200లకు పైగా ప్లాట్లు 
  5. త్వరలోనే కొత్త ధరలు నిర్ణయించి అమ్మకానికి ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాజీవ్ స్వగృహలో మిగిలిపోయిన ప్లాట్లను, ఖాళీ స్థలాలను విక్రయించాలని సర్కార్ నిర్ణయించింది. గతంలో అమ్ముడు పోగా అసంపూర్తిగా మిగిలి ఉన్న ఇళ్లను, మరిన్ని ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన భూములను అమ్మడం ద్వారా కనీసం రూ. 3,500 కోట్లను సమీకరించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.  అసంపూర్తిగా  ఉన్న ఇళ్లను ఉన్నవి ఉన్నట్లుగా విక్రయించాలని నిర్ణయించింది.

ఇందుకోసం ప్లాట్లకు ధరలను నిర్ణయించేందుకు గతంలో వేసిన కమిటీ ఆయా ఇళ్ల పరిస్థితి, అక్కడి మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలను సిఫార్సు చేస్తూ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అధికారికంగా ధరలను వెల్లడించి లాటరీ పద్దతిలో ఇళ్లను విక్రయించాలనే ఆలోచన చేస్తున్నది.

ప్రస్తుతం నగరంలోని పోచారం, నాగోలు సమీపంలో బండ్లగూడ, గాజుల రామారం, జవహర్‌నగర్, ఖమ్మం పట్టణ శివారు మున్నేరు సమీపంలో ఇళ్లు ఉన్నాయి. నిర్మాణాలు చేపట్టకుండా ఉన్న ఖాళీ భూము లు 135 ఎకరాల వరకు ఉన్నాయి. కామారెడ్డి, కవాడిపల్లి, పేట్‌బషీరాబాద్, పోలేపల్లి, తట్టి అన్నారం, నల్లగొండ తదితర ప్రాంతాల్లో భూములున్నాయి.

చిన్న,చిన్న మరమ్మతులు చేస్తే వినియోగంలోకి.. 

ప్రస్తుతం చిన్న చిన్న పనులు, మరమ్మతులు మినహా మిగతా మొత్తం ఉన్న ఇళ్లు నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్‌కేసర్ పరిధిలోనే పోచారం, ఖమ్మంలో మాత్రమే ఉన్నాయి. సింగిల్‌బెడ్ రూమ్ ప్లాట్లు బండ్లగూడలో 105, పోచారంలో 255, డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లు బండ్ల గూడలో 19 , పోచారంలో 340 ఉన్నాయి. ట్రిపుల్ బెడ్‌రూమ్ ప్లాట్లు బండ్లగూడలో 8, పోచారంలో 4, సీనియర్ సిటిజన్స్ ప్లాట్లు బండ్లగూడలో 24 సిద్ధంగా ఉన్నాయి. గాజుల రామారంలో 408 ప్లాట్లు  అసంపూర్తిగా ఉన్నాయి.

ఒక్కోటి 8 అంతస్తులుగా ఉన్న 5 టవర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో 3 బీహెచ్‌కే ప్లాట్లవి 3 టవర్లు, 2 బీహెచ్‌కే ప్లాట్లవి 2 టవర్లు ఉన్నాయి. పోచారంలో పూర్తయిన ఇళ్లకు సంబంధించి జీ ప్లస్ 9 అంతస్తులతో కూడిన 19 టవర్లుంటే.. వీటిలో చాల పనులు చేసుకోవాల్సిన అసంపూర్తి ఇళ్ల టవర్లు ఎనిమిది ఉన్నాయి. గతేడాది రెండు టవర్లను అమ్మగా ఇంకా ఆరు ఉన్నాయి. వీటిలో పైకప్పులు నిర్మించిన 376 ఉన్నాయి. మిగతా టవర్లలో పైకప్పులు నిర్మిస్తే మొత్తం 694 ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి.

టవర్ల మధ్యలో 19 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఖమ్మంలో పట్టణం శివారులోని మున్నేరు కాలువ ఒడ్డు ప్రాంతంలో జీ ప్లస్ 9 అంతస్తులతో కూడిన ఎనిమిది టవర్లు నిర్మించారు. వీటిలో 3 బీహెచ్‌కే డీలక్స్ ఇళ్లతో కూడినవి నాలుగున్నాయి, వీటిల్లో 576 ప్లాట్లున్నాయి. ప్లాట్లలో ప్లాస్టరింగ్ పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. ఇతర ఫిటింగ్స్, డ్రైనేజి, రోడ్లలాంటి వసతులు కల్పించాల్సి ఉంది. 

ఇళ్ల కోసం కేంద్ర ఉద్యోగులు దరఖాస్తులు.. 

ఇళ్లను కొనుకున్నవారు సొంతంగా ఖర్చు చేసి మిగతా పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ ధరలతో పోలిస్తే దాదాపు 35 శాతం తక్కువ ధరలకే ఇళ్లు సొంతమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిలో కొన్నింటిని తమకు  కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన తపాలశాఖ, ఎఫ్‌సీఐ, ఆదాయపన్ను శాఖ ఉద్యోగులతో పాటు అటవీశాఖ ఉద్యోగులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. ఒకేసారి ప్లాట్ల టవర్లను గంపగుత్తగా కొనుగోలు చేసి ప్రయివేట్ సంస్థలతో పనులను చేయించుకోవాలని, ఆ తర్వాత గృహప్రవేశాలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. 

మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువ.. 

ఆయా ప్రాంతాల్లో భూమి ధర, ఇళ్ల ధరను ప్రస్తుత కండిషన్ ఆధారంగా చూస్తే చదరపు అడుగు ధరను నిర్ణయిస్తూ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అధికారికంగా ధరను ఖరారు చేయాల్సి ఉంది. అది తేలగానే ఇళ్ల అమ్మకపు ప్రకటన వెలువడనుంది. గతేడాది పోచారంలో చ.అ. ధర రూ. 1,650 చొప్పున ఖరారు చేశారు. వాటిని కొన్నవారు చ.అ.కు రూ. 1050 ఖర్చు చేసి ప్రవేట్ బిల్డర్లతో ఇళ్లను సిద్ధం చేసుకున్నారు.

వెరసి ఒక్కో ప్లాట్ చ.అ, ధర రూ. 2,700 గా పలికనట్లయింది. అ ప్రాంతంలో ప్రయివేట్ నిర్మాణదారులు చ. అడుగును రూ. 4,500 నుంచి రూ. 5 వేల వరకు అమ్ముతున్నారు. గాజులరామారంలో చ. అడుగును రూ. 1,600 చొప్పున కొనుగోలు చేయగా, చ. అడుగుకు రూ. 1150 చొప్పున ఖర్చు చేశారు. ప్రస్తుతం అక్కడ చ. అడుగుకు ధర రూ. 6,500 వరకు వరకు పలుకుతోంది. మిగిలిన ప్లాట్లను పాత ధరలకు 5 శాతం వరకు పెంచి విక్రయించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం.