calender_icon.png 19 April, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఆర్డీవో మరో ఘనత

14-04-2025 01:02:16 AM

విజయవంతంగా లేజర్ ఆధారిత ఆయుధ పరీక్ష

కర్నూలు, ఏప్రిల్ 13: అధిక శక్తి గల లేజర్ ఆధారిత ఆయుధాన్ని డీఆర్డీవో, నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (ఎన్‌వోఏఆర్) ఆదివారం విజయవంతంగా పరీక్షించాయి. ఇప్పటి వరకు ఇటువంటి టెక్నాలజీ కేవలం అమెరికా, చైనా, రష్యా వద్ద మాత్రమే ఉండగా.. ఈ పరీక్ష విజయవంతంతో ఇక ఇండియా కూడా ఆ దేశాల సరసన చేరనుంది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశం భారత్ కావడం గమనార్హం.

ఈ వెపన్ సిస్టమ్‌తో శత్రు డ్రోన్లను, క్షిపణులను సులభంగా కూల్చే సామర్థ్యం వస్తుం ది.  ఈ మిషన్ గురించి డీఆర్డీవో ఎక్స్‌లో పేర్కొంది. ‘వాహనంలో అమర్చిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) ఎంకే 2(ఏ) ల్యాండ్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించాం. ఇది యూఏవీ, డ్రోన్‌లను సమర్థవంతంగా అడ్డుకుంది. డ్రోన్‌లను కూల్చ డమే కాదు. సెన్సార్‌లు పనిచేయకుండా ఇది అడ్డుకుంది. ఈ విజయంతో డీఈడబ్ల్యూ సాంకేతికత కలిగి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది’ అని పోస్ట్ చేసింది. 

ఇది ఆరంభం మాత్రమే.. 

ఇది కేవలం ఆరంభం మాత్రమే అని డీఆర్డీవో చైర్మన్ సమీర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు యూఎస్, చైనా, రష్యాలు మాత్రమే లేజర్ ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఇజ్రాయెల్ కూడా ఈ టెక్నాలజీపై పని చేస్తోంది. ఈ టెక్నాలజీని ప్రదర్శించిన నాలుగో లేదా ఐదో దేశం మనదే’ అని ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ విజయవంతానికి సంబంధించిన వీడియో పుటేజీని డీఆర్డీవో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ టెక్నాలజీని డీఆర్డీవో, ఎల్‌ఆర్డీఈ, ఐడీఆర్‌ఈ, డీఎల్‌ఆర్‌ఎల్ వంటి సంస్థలతో కలిసి రూపొందించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీ రూపొందించబడింది.