- పంత్‌కు 27 కోట్లు.. శ్రేయస్‌కు 26.75 కోట్లు
- వెంకటేశ్ అయ్యర్‌కు జాక్‌పాట్
- అర్ష్‌దీప్, చాహల్‌కు చెరో 18 కోట్లు
- వేలంలో భారత క్రికెటర్లకు పెద్ద పీట
ఐపీఎల్ మెగావేలంలో రికార్డులు బద్దలయ్యాయి. ఎప్పుడు వేలం జరిగినా విదేశీ క్రికెటర్ల వెంబడి పడే మన ఫ్రాంచైజీలు ఈసారి మాత్రం స్వదేశీ క్రికెటర్ల వైపు మొగ్గారు. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే భారత స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లు కళ్లు చెదిరే ధర పలికి చరిత్ర సృష్టించారు. రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులకెక్కాడు. అటు శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల రికార్డు ధరను వెచ్చించి సొంతం చేసుకోవడం విశేషం. యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌కు జాక్‌పాట్ తగిలింది.
వీరితో పాటు అర్ష్‌దీప్, యజ్వేంద్ర చహల్, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, షమీ కూడా వేలంలో మంచి ధర దక్కించుకున్నారు. రెండు రోజుల పాటు జరగనున్న మెగావేలంలో మొదటి రోజే చాలా మంది స్టార్ క్రికెటర్లు వేలంలోకి రావడంతో ప్రధాన ఘట్టం ముగిసినట్లే. నేడు కొనసాగనున్న వేలంలో ఏ క్రికెటర్ ఎక్కువ ధర పలుకుతాడో వేచి చూడాలి..
విజయక్రాంతి ఖేల్ విభాగం: ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ మెగావేలం అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న వేలంలో తొలిరోజే రికార్డులు బద్దలయ్యాయి. విదేశీయులు వద్దు.. స్వదేశీయులే ముద్దు అన్న చందంగా వేలంలో బరిలోకి దిగిన ఫ్రాంచైజీలు ఎవరు ఊహించని విధంగా ఈసారి భారత క్రికెటర్లను ఫ్రాంచైజీలు అందలం ఎక్కించాయి.
వేలానికి సౌదీ అరేబియాలో జెద్దా వేదికగా మారింది. ఐపీఎల్ వేలం బయట నిర్వహించడం ఇది రెండోసారి. మొదట ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వేలానికి సంబంధించి సందేశం ఇచ్చారు. ఈసారి వేలాన్ని మల్లికా సాగర్ నిర్వహించారు. అంగరంగవైభవంగా మొదలైన వేలంలో ఊహించనట్లుగానే భారత స్టార్ క్రికెటర్లు మంచి ధర పలికారు.
ముందుగా భారత క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ వేలంలోకి రాగా.. సన్‌రైజర్స్ అతడిని రూ. 15.75 కోట్లకు దక్కించుకుంది. ఈ దశలో పంజాబ్ కింగ్స్ రైట్ టూ మ్యాచ్ ఉపయోగించి రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత రబాడ వేలంలోకి రాగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి.
చివరకు గుజరాత్ 10.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి ఇంగ్లండ్ స్టార్ జాస్ బట్లర్ కోసం రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్ పోటీ పడ్డాయి. మధ్యలో పంజాబ్ కింగ్స్ 9.50 కోట్లతో రేసులోకి వచ్చినప్పటికీ గుజరాత్ రూ. 12 కోట్లు బిడ్ వేసింది. ఈ నేపథ్యంలో లక్నో 13.75 కోట్లు బిడ్ వేయగా.. చివరగా గుజరాత్ 15.75 కోట్లు బిడ్ వేసి బట్లర్‌ను కొనుగోలు చేసింది.
అటు శ్రేయస్.. ఇటు వెంకటేశ్
గత సీన్‌లో కోల్‌కతాను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన అయ్యర్ కోసం కోల్‌కతా తొలుత బిడ్ వేసింది. పంజాబ్ రేసులోకి రావడంతో ఆ తర్వాత బిడ్‌ను రూ. 7.25 కోట్లకు పెంచింది. మధ్యలో ఢిల్లీ బిడ్‌ను రూ. 14 కోట్లకు తీసుకెళ్లింది. ఆపై అయ్యర్ రేటు అంతకంతకూ పెరుగుతూ పోయింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ మరోసారి 26 కోట్లు బిడ్ దాఖలు చేయడంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన మిచెల్ స్టార్క్ (రూ. 24 కోట్లు) దాటేశాడు. చివరగా పంజాబ్ రూ. 26.75 కోట్లకు దక్కించుకుంది. మరో యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కూడా తన పవర్ చూపించాడు. గతేడాది కోల్‌కతా టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన వెంకటేశ్ అయ్యర్‌కు నిజంగా జాక్ పాట్ తగిలింది.
అతని కోసం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తెగ పోటీ పడ్డాయి. చూస్తుండగానే వేలంలో 20 కోట్లు దాటేసిన వెంకటేశ్ అందరి కంటే ఎక్కువగా పలుకుతాడా ఏంటి అన్న దశలో పంజాబ్ వెనుకడుగు వేయడంతో చివరకు 23. 75 కోట్ల రికార్డు ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ కోసం భారీ పోటీ ఉంటుందనుకున్న తరుణంలో ఢిల్లీ అతడిని రూ. 14 కోట్లకు సొంతం చేసుకుంది.
పంత్ అదరహో..
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికి చరిత్ర సృష్టించాడు. రూ. 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి దిగిన పంత్ కోసం బెంగళూరు, లక్నో పోటీ పడ్డాయి. వేలంలోకి దిగుతూనే 9 కోట్లతో తన వేటను ప్రారంభించిన పంత్ కోసం మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్రయత్నించింది.
కానీ పట్టు వదలని లక్నో చివరి వరకు పంతం పట్టి మరి అతన్ని దక్కించుకుంది. హైదరాబాద్ రూ. 20.50 కోట్లు చెప్పగా.. లక్నో రూ. 20.75 కోట్లతో బిడ్ వేసింది. దీంతో పంత్‌ను వదులేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ రేసులోకి వచ్చి రైట్ టు మ్యాచ్ ఉపయోగించాలని చూసింది. ఇది పసిగట్టిన లక్నో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 27 కోట్లు బిడ్ వేసింది. ఆ తర్వాత పోటీలోకి ఎవరు రాకపోవడంతో పంత్ లక్నో సొంతమయ్యాడు.
భారత క్రికెటర్లకు అందలం..
ఈసారి వేలంలో ఫ్రాంచైజీలు గతానికి భిన్నంగా ప్రవర్తించాయి. ఎప్పుడు వేలంలో విదేశీ క్రికెటర్లను ఎక్కువ ధరకు కొనగోలు చేసే ఫ్రాంచైజీలు ఈసారి మాత్రం భారత క్రికెటర్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపింది. కోట్లు ఖర్చు పెట్టి విదేశీ క్రికెటర్లను కొనుక్కుంటే పట్టుమని పది మ్యాచ్‌లు ఆడకుండానే సిరీస్‌ల పేరుతో వారి దేశాలకు వెళ్లిపోతున్నారు.
దీంతో ఆయా క్రికెటర్లు ఒక్క మ్యాచ్ ఆడినా పూర్తి ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇది తలకు మించిన శిరోభారం అవతుఓంది. దీంతో ఈసారి గేర్ మార్చిన ఫ్రాంచైజీలు ప్లేయర్లపై కోట్లు గుమ్మరించడం కంటే స్వదేశీ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తే ప్రయోజనం ఉంటుందని భావించాయి. అందుకే యజ్వేంద్ర చహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అశ్విన్ సహా చాలా మంది భారత క్రికెటర్లు మంచి ధర దక్కించుకున్నారు.
ఇక ఐపీఎల్ చరిత్రలో గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ ఉన్నాడు. గతేడాది జరిగిన మినీ వేలంలో స్టార్క్‌ను కోల్‌కతా 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా పంత్, శ్రేయస్ అయ్యర్ ఒకేసారి స్టార్క్ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. వేలంలో అధిక ధర పలికిన తొలి ఆటగాడిగానూ పంత్ చరిత్ర సృష్టించాడు.
అన్‌సోల్డ్ జాబితా
బెయిర్ స్టో
డేవిడ్ వార్నర్
పడిక్కల్
వకార్ సలామ్
అన్‌మోల్‌ప్రీత్
యశ్ దుల్
ఉత్కర్ష్
ఉపేంద్ర
సిసోడియా
వేలంలో ఏ ఆటగాడికి ఎంతంటే
ఆటగాడు జట్టు ధర
(రూ. కోట్లలో)
రిషబ్ పంత్ లక్నో 27
శ్రేయస్ పంజాబ్ 26.75
వెంకటేశ్ కోల్‌కతా 23.75
అర్ష్‌దీప్ పంజాబ్ 18
చాహల్ పంజాబ్ 18
బట్లర్ గుజరాత్ 15.75
రాహుల్ ఢిల్లీ 14
ఆర్చర్ రాజస్థాన్ 12.50
బౌల్ట్ ముంబై 12.50
హాజిల్‌వుడ్ బెంగళూరు 12.50
సిరాజ్ గుజరాత్ 12.25
స్టార్క్ ఢిల్లీ 11.75
సాల్ట్ బెంగళూరు 11.50
ఇషాన్‌కిషన్ సన్‌రైజర్స్ 11.25
జితేశ్ శర్మ బెంగళూరు 11
స్టోయినిస్ పంజాబ్ 11
రబాడ గుజరాత్ 10.75
నటరాజన్ ఢిల్లీ 10.75
షమీ సన్‌రైజర్స్ 10
నూర్ అహ్మద్ చెన్నై 10