23-03-2025 05:03:09 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిర అనాధ వృద్ధాశ్రమంలో మఠంపల్లి మండలం అల్లిపురం గ్రామానికి చెందిన కర్లపూడి అనిల్ స్రవంతి దంపతుల కుమారుడు రెయాన్షు పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ పట్టణానికి చెందిన యలమంచిలి శ్రీనివాసరావు విజయలక్ష్మి దంపతులు హాజరై వారి చేతుల మీదుగా అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఇలా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, అలాగే ప్రతి ఒక్కరూ అనిల్ స్రవంతి దంపతులను ఆదర్శంగా తీసుకొని వారి వారి గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా వారి వారికి అందుబాటులో ఉన్న ఇలాంటి అనాధ ఆశ్రమాలలో వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించేసి వారికి అండగా నిలవాలని అన్నారు.
అలాగే ఎన్నో కష్టనష్టాలతో ఎన్నో ఇబ్బందులకు గురై గత 25 సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ గారి కోరిక మేరతో వృద్ధులకు ఉండటానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటే 10 లక్షల వ్యయంతో నాలుగు అదనపు గదులను నిర్మించి, ఈ ఆశ్రమానికి నా వంతుగా అండగా నిలిచానని అలాగే ఇటీవల కొందరు దాతలు దాతృత్వంతో ఆశ్రమానికి కావలసిన వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అలాగే మిగిలిన వారు కూడా వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఇలా నిరాదారణకు గురైన వారిని ఆదుకునేందుకు ముందుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుటుంబ సభ్యులు ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.