ఇటీవలి కాలంలో నిత్యా మీనన్ మరింత నిక్కచ్చిగా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను తూర్పారబడుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘కాదలిక్క నేరమిల్లు’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్స్‌లో భాగంగా తాను ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టింది. చిత్ర నిర్మాతలు కొందరు అనారోగ్యంతో ఉన్నా.. పిరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా కూడా పట్టించుకోరని.. వారికి పని మాత్రమే ముఖ్యమని చెప్పుకొచ్చింది. “సినీ పరిశ్రమలో చాలా అమానవీయత ఉంటుంది.
ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా సరే.. షూటింగ్‌కి రావాల ని దర్శకనిర్మాతలు చెబుతారు. మేం కూడా దానికి అలవాటు పడిపోయాం. కష్టపడాలి తప్పదు. 2020లో చేసిన ‘సైకో’ సినిమా షూటింగ్‌లో నాకు పిరియడ్స్ వచ్చాయి. చాలా నొప్పితో ఇబ్బంది పడ్డాను. తొలిసారిగా ఒక మగ దర్శకుడికి నా బాధను తెలిపాను. ఈ చిత్ర దర్శకుడు మిస్కిన్ ‘తొలి రోజా?’ అని అడిగాడు.
నన్ను మిస్కిన్ అర్థం చేసుకున్న తీరుకు ఆశ్చర్యం అనిపించింది. అవునని చెప్పగానే ‘మీరు విశ్రాంతి తీసుకోండి’ అన్నాడు. ‘నిత్య అసౌకర్యం నాకు అర్థమైంది.. ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేస్తా’ అని చెప్పాడు” అని నిత్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ధనుష్ దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ చిత్రంలో నటిస్తోంది.