calender_icon.png 31 October, 2024 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షయపాత్ర ద్వారా అన్నా క్యాంటీన్లు

14-07-2024 06:12:20 AM

అనంతశేష స్థాపనలో ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): మంచి చేయాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరింస్తుందని, వారి పనులకు ఎటువంటి ఆటంకం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా కొలను కొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మంచి చేసే వారందరికీ ఏపీ చిరునామాగా ఉంటుందని, మంచి చేసే వారంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అక్షయ పాత్ర స్పూర్తితో త్వరలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు.

హరేకృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవసేవను సమానంగా చేస్తుందని కొనియాడారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మదుపండిత్ కృషి చేస్తున్నారన్నారు. 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. వెంకటేశ్వర స్వామి దయతోనే పేలుళ్ళ నుంచి బయటపడ్డానని, ప్రజలకు సేవ చేసేందుకే నాకు దేవుడు ప్రాణభిక్ష పెట్టారన్నారు. అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారని, అన్నా క్యాంటిన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించిందన్నారు. 

హరేకృష్ణ సంస్థకు రూ.3 కోట్లు విరాళం

హరేకృష్ణ సంస్థ నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం కోసం దాతలు రూ.3 కోట్లు విరాళం ప్రకటించారు. పారిశ్రామిక వేత్త పెనుమత్స శ్రీనివాసరాజు రూ.1 కోటి విరాళం అందజేశారు. పూర్ టూ రిచ్ స్పూర్తితో వంద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. హరే కృష్ణ సంస్థకు సక్కు గ్రూప్ రూ.1 కోటి విరాళం అందించగా యలమంచలి కృష్ణమోహన్ గ్రూప్ రూ.కోటి విరాళం అందించాయి. ఈ సందర్భంగా దాతలను సీఎం చంద్రబాబు అభినందించారు.