calender_icon.png 23 December, 2024 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్మోల్ దనాధన్

22-12-2024 12:41:26 AM

35 బంతుల్లోనే శతకం భారత లిస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ యూసఫ్ పఠాన్ రికార్డు బద్దలు విజయ్ హజారే ట్రోఫీ

అహ్మదాబాద్: దేశవాలీ ప్రతిష్ఠాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డులు బద్దలయ్యాయి. పంజాబ్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ లిస్ట్ క్రికెట్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించగా.. ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శతకంతో మెరిసినప్పటికీ ఆ జట్టు ఓటమి పాలవ్వడం.. అభిషేక్ పోరెల్, క్రిష్ణన్ శ్రీజిత్ తమ సెంచరీలతో ఆయా జట్ల విజయాల్లో కీలకపాత్ర పోషించారు. శనివారం మొదలైన టోర్నీలో అహ్మదాబాద్ వేదికగా గ్రూప్ అరుణాచల్ ప్రదేశ్‌పై పంజాబ్ 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 48.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. టెక్ నెరి (42), హార్దిక్ వర్మ (38) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అశ్వనీ కుమార్, మయాంక్ మార్కండే చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ 12.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి 167 పరుగులు చేసి గెలుపొందింది.

అన్మోల్‌ప్రీత్ (45 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ శతకం సాధించగా.. ప్రబ్‌సిమ్రన్ (35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా 35 బంతుల్లోనే సెంచరీ సాధించిన అన్మోల్ భారత లిస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో యూసఫ్ పఠాన్ (40 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉంది. 2010లో మహారాష్ట్రపై బరోడా తరఫున యూసఫ్ పఠాన్ ఈ ఘనత సాధించాడు. 

అయ్యర్ శతకం బాదినా..

ఇదే అహ్మదాబాద్ వేదికగా జరిగిన కర్నాటక, ముంబై మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. శ్రేయస్ అయ్యర్ భారీ శతకంతో విరుచుకుపడినా ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబైపై కర్నాటక 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. అయ్యర్ (114 నాటౌట్), ఆయుశ్ హత్రే (78), శివమ్ దూబే (63) రాణించారు.

అనంతరం కర్నాటక జట్టు 46.2  ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. క్రిష్ణన్ (101 బంతుల్లో 150 నాటౌట్) అజేయ సెంచరీ సాధించగా.. అనీశ్ (82), ప్రవీన్ దూబే (65 నాటౌట్) రాణించారు. మిగిలిన మ్యాచ్‌ల్లో త్రిపురపై బరోడా, నాగాలాండ్‌పై హైదరాబాద్, హర్యానాపూ గుజరాత్, మణిపూర్‌పై ఉత్తరాఖండ్, ఒడిశాపై గోవా, మేఘాలయాపై హిమాచల్ ప్రదేశ్, రైల్వేస్ జట్టుపై ఆంధ్ర, రాజస్థాన్‌పై మహారాష్ట్ర, బిహార్‌పై మధ్యప్రదేశ్ విజయాలు సాధించాయి.