calender_icon.png 25 December, 2024 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమాలకు అడ్డ అంకుష్!

06-11-2024 12:00:00 AM

మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది ‘అంకుష్ గ్రాఫిక్స్’. ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ర్యాలీ ఉందంటే.. అప్పటికప్పుడు నల్లకుంటలోని అంకుష్ గ్రాఫిక్స్‌లో బ్యానర్ డిజైన్ అయ్యేది. ఉద్యమ సమయంలో తెలంగాణ పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాల మీద ఇంటెలిజెన్స్ వారికి ఓ నజర్ ఉండేది. ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద బ్యానర్ ఎలా రెడీ చేశారు.. ఇన్నీ వేల కరపత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో.. తెలియక తలలుపట్టుకునేటోళ్లు.

అసలు వాటికి రూపకర్త ఎవరంటే.. అంకుష్ చిన్నా. ఉద్యమకారుడిగా అంకుష్ చిన్నా ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని.. ఉద్యమ పోరును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ ఆంధ్రోళ్లు తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి విజయక్రాంతితో పంచుకున్నారు..     

నా అసలు పేరు సైదులు.. పుట్టి, పెరిగింది నల్గొండ జిల్లా కరివిరాల కొత్తగూడెం. సైదులుగా కంటే చిన్నా అంటేనే అందరికీ బాగా తెలుసు. చిన్నతనం నుంచి ఉద్యమ భావజాలం ఉన్న కుటుంబంలో పుట్టి, పెరగడంతో ఆ ప్రభావం నాపై ఎక్కువగా పడ్డది. పై చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చా.. మొదట్లో అడిక్‌మెట్ లలిత నగర్‌లోని విమోచన ఆఫీసులో ఉండి.. సహచర బుక్ మార్క్‌లో ఉండే విప్లవ సాహిత్యాన్ని విపరీతంగా చదవడం మొదలెట్టా.

అలా చదవడం ద్వారా చాలా విషయాలు అవగాహనకు వచ్చాయి. నల్లకుంటలో అంకుష్ గ్రాఫిక్స్ ఏర్పడటానికి మా అన్న మూర్తి,  మారోజు వీరన్న కారణం. విప్లవ సిద్ధాంతాన్ని, సాహిత్యాన్ని కంప్యూటీకరించే క్రమంలో భాగంలో కంప్యూటర్ కోనాలానే ఓ ప్రపొజల్ పెట్టుకున్నాడు మారోజు వీరన్న. ఆ వర్క్ పూర్తి కాగానే.. మారోజు వీరన్నే ఇది ఎలాగైనా భవిష్యత్తులో అవసరం కాబట్టి దీనికి ‘అంకుష్ గ్రాఫిక్స్’అని పేరు పెట్టాడు. అదే ఆఫీసులో నేను డీటీపీ నేర్చుకొని పని చేసుకుంటూ.. ఎమ్‌సియే, బీసీఏ చదువుకున్నా. 

తెలంగాణ మహా సభ..

1970లో మారోజు వీరన్న ఆధ్వర్యంలో తెలంగాణ మహా సభ జరిగింది. దానికి చెరుకు సుధాకర్ అధ్యక్షత వహించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఈ సభ నిర్వహించారు. అదే సందర్భంలో పత్రిక కూడా తీశారు. దాని పేరు ‘తెలంగాణ మహ సభ’. ఆ సభలో మొట్టమొదటిసారి గద్దర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ.. పాట పాడారు.

ఆ పాటను పత్రికలో ప్రచురించాలి అని ప్రయత్నం చేశారు. అది రిటర్న్ స్కీప్ట్ లేకపోవడంతో క్యాసెట్‌లో వినుకుంటూ అక్షరీకరించా. అలా మొదటిసారి తెలంగాణ మహసభ సందర్భం గా నా ద్వారా గద్దర్ పాట పబ్లిష్ అయింది. అట్ల తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అడుగు పెట్టాను.

అలా ప్రొఫెసర్ జయశంకర్.. కోదండరామ్‌తో పరిచయాలు అయ్యాయి. మా ఆఫీసుకు రావడం, పుస్తకాలు వేయడం. తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన వర్క్ అంతా మెజారిటీగా అంకుష్ గ్రాఫిక్స్‌లోనే చేశాం. అయితే అప్పటికే నాకు మూవీ డైరెక్షన్ చేయాలని ఓ లక్ష్యం ఉండేది. 

తెలంగాణ సినిమా అవసరం..

తెలంగాణ యువత ఎంత చదువుకున్న ఉద్యోగాలు రాకపోయేది. సినిమాల్లో కూడా మన భాషను వెకిలిగా వాడేది. ఆరే వాడికి తెలుగు భాష మాతృభాష అయినప్పుడు.. తెలంగాణ నాకు మాతృభాష అయితది కదా అనే స్పృహా కలిగింది. ఒక కవి ఇలా అంటాడు.. “యుద్ధం జరిగితే మనుషులే చచ్చిపోవచ్చు.. కానీ అదే సంస్కృతి చచ్చిపోతే మనుషుల పునాది కూడా ఉండదు” అని అంటాడు.

ఈ రెండు పదాల ప్రభావం నాపై ఎక్కువ పడ్డది. చిన్నప్పటి నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయలను వింటూ పెరిగాను.. ఎప్పుడైతే డిగ్రీలో చేరానో అప్పుడే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యా. అదే సమయంలో తెలంగాణ సినిమా కోసం పని చేయాలని నిర్ణయం తీసుకున్నా.  

దక్కన్ సినిమా బ్యానర్

దేశం మొత్తానికి బాలీవుడ్ అనేది ఒకటి ఉంది. కానీ అక్కడ మరాఠీ సినిమా బతుకుతున్నది. అది కూడా చాలా గొప్పగా, అద్భుతంగా బతుకున్నది. మట్టి మనుషుల సినిమాలు కథలుగా వస్తున్నాయి. మరీ తెలుగు సినిమాలో తెలంగాణ సినిమా ఎందుకు బతకదు. ఇక్కడి చరిత్ర చాలా గొప్పది. మన సాహిత్యం, మన పాటలు.. సజీవంగా ఉంటాయి.

మలిదశ ఉద్యమ సమయంలో ధూంధాంలు ఎక్కడ పెట్టిన సక్సెస్ అయ్యాయి. సినిమాల కంటే ఎక్కువ విజయాన్ని సాధించాయి. దానికి కారణం మన పాట. ఆ పాటను బతికించింది తెలంగాణ కళాకారులు. తెలుగు సినిమాలో తెలంగాణ పాట నేపథ్యం ఎలా ఉంటది.. తెలంగాణ ఉద్యమ పాట ఎలా ఉన్నది? ఇంత దోపీడి జరిగినా? ఇంత దాడి జరిగిన ఎట్ల నిలబడగలిందనే దానిపై నాలుగైదు ఆర్టికల్స్ రాశా..

అప్పుడే తెలంగాణ లేని తెలుగు సినిమా అని రాశా.. దానిపై ప్రెస్ క్లబ్‌లో డిబెట్ జరిగింది. అప్పుడే ‘దక్కన్ సినిమా బ్యానర్’ను ప్రారంభించా.. దానికి రూపకల్పనంత నాదే. ఇప్పటికీ దానికి అధ్యకుడిగా పని చేస్తున్నా. అదే స్థాయిలో కూడా దాని కోసం పనిచేశా.

తెలంగాణ జేఏసీని, ఎమ్మెల్యేలను, టీఎన్‌జీవోలు, టీజీవోలను కలిసి ‘పోరు’ అని సినిమా పేరు పెట్టి గన్‌పార్క్ దగ్గర సినిమా లాంచ్ చేశాం. దాని కోసం ‘టీ స్టార్  హంట్’ తో పది జిల్లాలు తిరిగి.. పోస్టర్లు లాంచ్ చేయడం.. స్పీచ్‌లు ఇవ్వడం.. తెలంగాణ సినిమా అవసరాన్ని వివరించాం.

ఇప్పటికీ వనరుల దోపిడి! 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ సినిమా ఎట్ల ఉండాలి అని రౌండ్ టెబుల్ మీటింగ్స్ నిర్వహించాం. బి.నర్సింగ్ రావు, ఎన్.శంకర్, క్రిశాంక్ వీళ్లందరితో పెద్ద మీటింగ్ నిర్వహించాం. ఇప్పటికీ తెలంగాణ వచ్చి పదేళ్లు గడుస్తున్న.. తెలంగాణ సినిమా ఊసే లేదు. అదే కాస్త బాధేస్తుంది. తెలంగాణ భాష మీద సినిమా తీస్తే.. అది తెలంగాణ సినిమా ఎట్ల అవుతుంది.

ఆ సినిమాలో తెలంగాణ ఆర్టిస్టులు ఒక 70 శాతం మంది ఉండాలి. ఇక్కడి యువతకు ఉపాధి రావాలి.  సినిమా షూటింగ్‌లో చూస్తే ఎక్కువగా తెలంగాణ యువత లేబర్‌గా.. లైట్ మ్యాన్లుగా పనిచేస్తున్నవారే. అప్పర్ సెక్షన్ మొత్తం ఆంధ్ర వాళ్లే ఉంటారు. తెలుగు సినిమాను తెలంగాణ డైరెక్టర్లే ఎలుతారని నేను గతంలో ఒక స్టేట్‌మ్మెంట్ చేశా.. ఇప్పుడు అదే జరుగుతున్నది.

తెలంగాణ వచ్చాక దసరా.. బలగం.. వంటి పేరున్న సినిమాలు తీసిందంతా తెలంగాణ డైరెక్టర్లే. మళ్లీ సినిమాలో హీరోలంతా వాళ్లే ఉంటారు. ఓ రకంగా మన వనరులు వాడుకుంటూ.. మన ప్రాంతంలో బతుకుతూ.. మన మీదనే అధికారం చెలాయిస్తారు. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉన్నది. ఉద్యమ సమయంలో సాగరహారంలో దక్కన్ సినిమా బ్యానర్ పట్టుకొని ఒక టీమ్‌గా వెళ్లాం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సినిమా కోసం ఒక విభాగమే నడుపుతున్నాడు అని జేఏసీ గుర్తించి.. నా పేరును దక్కన్ సినిమా ‘చేరన్’ అని పేరు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం స్కిల్డ్ యూనివర్సిటీ పెట్టడం మంచిదే. కానీ అది నేర్చుకున్నాక సొంతంగా సినిమా తీసుకునే అవకాశం ఉండదు. అది సాధ్యం కావాలంటే ప్రత్యేక తెలంగాణ సినిమా ఫాలసీ తీసుకురాలేనంత కాలం ఉపయోగం ఉండదు.

మొన్నటిదాక కోర్టు చుట్టూ తిరిగా!

ఉద్యమంలో పాల్గొన్నందుకు.. ఉద్యమానికి నావంతు సహకారం అందించినందుకు నక్సలైట్‌గా ముద్రవేసి కేసు పెట్టారు. ఉద్యమ సమయంలో ఓయూ జేఏసీకి అంకుష్ గ్రాఫిక్స్ మెయిన్ అడ్డ. ఓయూ జేఏసీకి పనిచేశా. ఓయూ జేఏసీలో పనిచేస్తున్న సమయంలో పదిమంది కూర్చొని ‘నాలుగు గంటలకు మీటింగ్.. ఆరు గంటలకు ర్యాలీ తిద్దాం’ అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటోళ్లు.

ఆరు గంటలకల్లా పెద్ద బ్యానర్ ఉండేది అక్కడ. అది ఇంటెలిజెన్స్ వాడికి మండిపో యేది.. ఆరె వాడు అంత పెద్ద బ్యానర్ తయారుచేసేదాక మీరేం చేస్తున్నారా.. అని పోలీసులోళ్లను తిట్టేవాళ్లు. బ్యానర్లు కూడా చాలా ఎఫెక్ట్‌గా వచ్చేవి. అట్ల అంకుష్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈ బ్యానర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ్.. ఎవరి దగ్గరకు పోతున్నాయ్ అని ఒక నజర్ పెట్టి..

మనమీద కొంత ఒత్తిడి తీసుకురావాలని.. నాపై 2013లో నక్సలైట్ కేసు పెట్టాడు. తెలంగాణ వచ్చాక రెండు వేల కేసులు కొట్టేసిందని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది.. మరీ నా కేసు ఎందుకు కొట్టేయలేదని అడిగితే.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఏకైక నక్సలైట్ కేసు ఇది. కాబట్టి కొట్టేయలేదు.. దీన్ని లీగల్‌గానే చూసుకోవాలి అని చెప్పారు. ఆ కేసును ఈ ఏడాదే కొట్టి వేశారు. 

 రూప