calender_icon.png 22 December, 2024 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకాపూర్ కంకులకు ఫుల్ డిమాండ్

03-08-2024 03:06:47 AM

  1. ఏటా రూ.కోట్లలో వ్యాపారం 
  2. మహారాష్ట్రలోనూ విక్రయాలు

నిజామాబాద్, ఆగస్టు 2(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ ప్రాం తంలో పెద్ద ఎత్తున సాగు చేసే పచ్చి మొక్కజొన్న కంకులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ కంకులను హైదారాబాద్, కరీంనగర్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో పాటు పలు జిల్లాలకు తరలించి, విక్రయిస్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు అంకాపూర్ వచ్చి మొక్కజొన్న కంకులను కొనుగోలు చేసి, తమ ప్రాంతాల్లో విక్రయిస్తారు. ఏటా వర్షాకాలం సీజన్‌లో మూడు నుంచి నాలుగు నెలల పాటు అంకాపూర్‌లో పచ్చి మొక్కజొన్న వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుంది. 

ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో సాగు

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, ఆలూరు, మాక్లూరు, నందిపేట్ మండలాలు, బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూరు, మొర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను సాగుచేస్తారు. ఆర్మూర్, ఆలూరు మండలాల్లో 15 వేల ఎకరాలు, బాల్కొండ మండలంలో పది వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేస్తారు. అంకాపూర్ పరిసరాల రైతులు పంటను పచ్చి మొక్కజొన్న రూపంలో విక్రయిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో రైతులు కంకులు ఎండిన తర్వాత విత్తనాలు ఒలిచి అమ్ముతారు. ప్రజ లు వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న కం కులను తినేందుకు, పచ్చి గింజలతో మక్క వడలు చేసుకుని తినేందుకు ఇష్టపడుతారు. 

చేనువద్దే కొనుగోళ్లు

అంకాపూర్ ప్రాంతంలో వ్యాపారులు డజను కంకులను రూ.50 నుంచి రూ.80 వరకు కొనుగోలు చేస్తారు. చిన్న మొత్తంలో కొనుగోళ్లు చేసేవారు అంకాపూర్‌లో ఉన్న మార్కెట్‌కు వచ్చే కంకులను కొని, వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. పెద్ద మొ త్తంలో కొనుగోళ్లు చేసేవారు నేరు గా రైతులు పండించిన మొక్కజొన్న చేలనే కొంటారు. వ్యాపారులే కూలీలను నియమించుకుని, పంటను కోసుకువెళ్తుండటంతో  రైతులకు లాభసాటిగా ఉంటుంది. గతేడాది ఎకరా పంట రూ.35 వేల నుంచి రూ.40 వేలు పలికింది. ఈ ఏడు రూ.70 వేలు నుంచి రూ.80 వేల వరకు విక్రయిస్తున్నారు.