calender_icon.png 1 October, 2024 | 9:57 AM

అంజన అర్జున్ అరంగేట్రం?

30-09-2024 12:29:19 AM

యాక్షన్ కింగ్‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు అర్జున్. కన్నడ రాష్ట్రానికి చెందిన ఆయనకు బహుభాషా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా దక్షిణాదిలో మంచి పేరుంది. ఆయన భార్య కూడా పెళ్లికి ముందు హీరోయిన్. ఆమె తండ్రీ నటుడే. అర్జున్ దంపతులకు ఇద్దరు సంతానం కాగా, పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ కొన్ని సినిమాలు చేసింది.

తమిళంలో విశాల్‌కు జంటగా ‘పట్టత్తు తానై’ అనే చిత్రం ద్వారా కథానాయకిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తర్వాత అర్జునే మెగాఫోన్ పట్టినా కూతురికి హీరోయిన్‌గా పెద్దగా పేరు రాలేదు. ఇటీవల స్టార్ కమెడియన్ కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య అర్జున్.

పెద్ద కూతురు అలా పరిశ్రమకు దూరం కాగా, ఇప్పుడు ఆమె చెల్లి ఆ బాధ్యతను తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించేందుకు రెండో కూతురు అంజన అర్జున్ రెడీ అయింది. ఆమె కథానాయికగా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారా? అంటే, సినీవర్గాల నుంచి.. అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానమే వస్తోంది.

అంజన ఇటీవల తన గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తోంది. యాక్షన్ కింగ్ వారసురాలిగా పెద్ద బిడ్డ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.. ఇప్పుడు చిన్న కూతురైనా మెప్పింస్తుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో ఆసక్తికరంగా మారింది.