calender_icon.png 27 November, 2024 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో రెచ్చిపోయిన దొంగలు

09-10-2024 12:00:00 AM

బైక్‌లపై వచ్చి రూ.1.50 లక్షల చోరీ

ఒక చోట రూ.లక్ష, మరో చోట రూ.50వేలు..

బ్యాంకుల్లో డ్రా చేసిన విషయాన్ని పసిగట్టిన దుండగులు

కామారెడ్డి, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో బైక్‌పై వచ్చిన దుండగులు రూ.1.50 లక్షలు దోచుకెళ్లడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఏవన్ గార్డెన్ యాజమాని సమీయుద్దీన్ మంగళవారం కెనరా బ్యాంకు నుంచి రూ.లక్ష డ్రా చేసి ఇంటికి బైక్‌పై తిరిగి వెళ్తున్నాడు.

పాల కేంద్రం వద్ద బైక్‌ను ఆపి అక్కడే నగదు పెట్టి పాలకోసం వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని యువకుడు రూ.లక్ష నగదును ఎత్తుకెళ్లాడు. బ్యాంకులో డ్రా చేసినప్పుడు గమనించిన యువకుడే చోరీకి పాల్పడినట్లు తెలుస్తున్నది. బాధితుడు బాన్సువాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలంలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. 

తాండూర్ చౌరస్తా వద్ద 

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గేటు వద్ద జరిగింది. నాగిరెడ్డిపేట మండలం అంకంపల్లి గ్రామానికి చెందిన జక్కుల రాములు నాగిరెడ్డిపేట యూనియన్ బ్యాంకులో రూ.50 వేలు డ్రా చేసుకుని నడుచుకుంటూ తాండూర్ గేటు వద్దకు చేరుకున్నాడు.

ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి రాములు చేతిలో ఉన్న రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాగిరెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బ్యాంకుల్లో డ్రా చేసినట్టు గమనించిన దుండగులు వెంబడించి ఎత్తుకెళ్లినట్టు తెలుస్తున్నది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.