29-04-2025 06:09:42 PM
అంగన్వాడీలకు ‘మే' నెల సెలవులు ఇవ్వాలి...
మహబూబాబాద్ (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలని కోరడానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంపూర్ణ, స్నేహ బిందు హైదరాబాద్ వెళుతుంటే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం సరైనది కాదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు అన్నారు.
అంగన్వాడి సమస్యల పరిష్కారంపై ఇప్పటికే పలుమార్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలో నిర్వహించినప్పటికీ స్పందన లేకపోవడంతో మంత్రి దృష్టికి తమ సమస్యలను విన్నవించడానికి మంగళవారం వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు మే నెల సెలవులు ప్రకటించారని, అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు కోశాధికారి సమ్మెట రాజమౌళి, పట్టణ కన్వీనర్ కుమ్మరి కుంట్ల నాగన్న ఉన్నారు.