calender_icon.png 29 November, 2024 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కా ప్లాన్‌తో అంగన్‌వాడీ టీచర్ హత్య

18-05-2024 02:19:53 AM

అడవిలో అత్యాచారం చేసి స్కార్ఫ్‌తో ఉరి

ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

వివరాలు వెల్లడించిన ములుగు డీఎస్పీ రవీందర్

హనుమకొండ/జయశంకర్ భూపాలపల్లి, మే 17 (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ అటవీ ప్రాంతంలోఈ నెల 14న జరిగిన అంగన్‌వాడీ టీచర్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య కేసును నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్టు గుర్తించారు. నిందితులు ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన రామయ్య, జంపయ్యను అరెస్టు చేశారు. ములుగు డీఎస్పీ రవీందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన అంగన్‌వాడీ టీచర్ సుజాత (౪౮) తాడ్వాయి మండలం కాటాపూర్‌లో పనిచేస్తున్నారు.

ఈ నెల 14న కాటాపూర్‌లో విధులు ముగించుకున్న చిన్నబోయినపల్లికి వెళ్లేందుకు బయలుదేరారు. అయితే బస్సు మిస్ కావడంతో అంతకు ముందే పరిచయం ఉన్న ఆకుదారి రామయ్య తాను లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. అప్పటికే రామయ్య తన బైక్‌పై పగిడి జంపయ్య అనే వ్యక్తిని అడవిలో నీళ్ల ఒర్రె వద్ద దించాడు. ఈ క్రమంలో తన బైక్‌పై అంగన్‌వాడీ టీచర్‌ను ఎక్కించుకున్న రామయ్య నేరుగా నీళ్ల ఒర్రె వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న జంపయ్యతో కలిసి రామయ్య అంగన్‌వాడీ టీచర్‌పై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత సుజాత మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె ప్రతిఘటించింది.

దీంతో ఆమె తలపై రాయితో కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ రాయిని నీళ్లలో పడేసిన నిందితులు.. ఆమె స్కార్ఫ్‌ను మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం  పుస్తెలతాడును తీసుకుని, మొబైల్ ఫోన్‌ను నీళ్లలో పడవేశారు. ఆమె బ్యాగ్‌ను అడవిలోకి దూరంగా విసిరేశారు. అనంతరం రామయ్య, జంపయ్య రొయ్యారుకు వెళ్లిపోయారు. మృతురాలి కుమారుడు చరణ్ ఫిర్యాదు మేరకు తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

పస్రా ఇన్‌స్పెక్టర్ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీలు, నిందితుల కాల్‌డేటా ఆధారంగా పూర్తి వివరాలు సేకరించారు. శుక్రవారం నిందితులను పట్టుకుని వారి నుంచి బంగారు పుస్తెలతాడు, వాహనం, తలపై బాదిన రాయి స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. అంగన్‌వాడీ హత్య కేసును చేధించి చాకచక్యంగా వ్యహరించి, నిందితులను పట్టుకున్న పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్సై చింత నారాయణ, సిబ్బందిని డీఎస్పీరవీందర్ అభినందించారు.