calender_icon.png 25 October, 2024 | 4:02 AM

అంగంట్లో అంగన్‌వాడీ ఉద్యోగాలు!

25-10-2024 01:17:54 AM

  1. అనారోగ్యంతో ఉన్న వారే లక్ష్యంగా బలవంతపు రాజీనామాలు
  2. ఆ తర్వాత పోస్టింగ్‌కు బేరాలు
  3. రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు వసూలు
  4. ఏజెన్సీ ప్రాంతాల్లో దందా
  5. సూత్రదారులు, పాత్రదారులు సీడీపీవోలు
  6. మధ్యవర్తులు అంగన్‌వాడీ టీచర్లు

భధ్రాద్రి కొత్తగూడెం, ఆక్టోబర్ 23(విజయక్రాంతి): అనారోగ్యం కారణంగా నెలల పాటు విధులు నిర్వహించని వారిని ఎంపిక చేసుకొని, వారి చేత బలవంతగా రాజీనామా చేయించి.. తిరిగి ఉద్యోగం కావాలంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్న దందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా సాగుతోంది.

మహిళా శిశు సంక్షేమ శాఖలో (ఐసీడీఏస్ ) ఈ తరహా అవినీతి పెట్రేగి పోతోంది.  ఇప్పటికే పర్యవేక్షణ పేరుతో పర్సెంటీజీలకు అలవాటు పడిన అధికారులు.. తాజాగా ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయించి, అనంతరం వారి వద్ద నుంచే రూ.లక్షలు దండుకొంటున్న వైనం చర్చనీయాంశంగా మారింది.

మారుమూల గిరిజన ప్రాంతాలను ఎంచుకొన్న సీడీపీవోలు కొత్త తరహా అవినీతికి తెరతీశారు. గుండాల మండలంలో ఇటీవల ఇద్దరు అంగన్‌వాడీ టీచర్లపై ఇదే తరహా దందాకు టేకులపల్లి సీడీపీవో శ్రీకారం చుట్టారు. 

అప్పుచేసి అప్పజెప్తున్నారు

రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో కొనెవారిగూడెం అంగన్‌వాడీ టీచర్ ధనలక్ష్మివిధులకు వెళ్లలేదు. ఆర్యోగం కుదుటపడిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ లేఖ రాసి సీడీపీవోను కలిశారు. సీడీపీవో, యూడీసీ కలిసి తొలుత ఆమె చేత బలవంతంగా రాజీనామా చేయించారు.

అనంతరం ఉద్యోగం కావాలి అంటే రూ.1.50 లక్షలు చెల్లించుకోవాలని సూచించడంతో అప్పుచేసి సీడీపీవోకు రూ.1.50 లక్షలు ఓ అంగన్‌వాడీ సమక్షంలో ఏడాది క్రితం ముట్టజెప్పారు. డబ్బులు తీసుకొన్న అధికారి ఇప్పటివరకు ఇవ్వకుండా తిప్పుతున్నారు. అదే మండలంలోని రోళ్లగడ్డ అంగన్‌వాడీ టీచర్ రెండు నెలలు పాటు విధులకు హాజరు కాలేదు.

ఇటీవల ఆమె విధుల్లో చేరడానికి పీడీ కార్యాలయానికి వెళ్తే మెను రాజీనామ చేయాలని బెదిరించారని సమాచారం. ఇలా వారిచేత బలవంతంగా రాజీనామా చేయించి వారి నుంచే లక్షలు దండుకొంటు సీడీపీవో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.

వాస్తవానికి అంగన్‌వాడీ టీచర్ ఏదైనా కారణం చేత ౬ నెలల పాటు విధులకు హాజరుకాకున్నా ఆమె ఉద్యోగానికి సమస్యేం ఉండదు. ఆరు నెలల లోపు తిరిగి విధుల్లో చేరే వెసులుబాటు ఉంది. కానీ, అక్రమార్జనకు అలవాటు పడిన సీడీపీవో వారిచేత రాజీనామా చేయించి కొత్త దందాకు తెరతీశారు. 

రాజీనామా చేస్తే.. ఉద్యోగం ఎలా? 

రాజీనామా అనేది ఒక బూటకంలా కన్పిస్తోంది. సీడీపీవో కార్యాలయంలో కొనెవారిగూడెం అంగన్‌వాడీ 2022లో రాజీనామా చేసినట్టు, పోస్టు వేకెన్సిగా రికార్డు చూపుతున్న అధికారులు, జిల్లా కార్యాలయంలో మాత్రం వేకెన్సీ కన్పించక పోవడం అనుమానాలకు తావిస్తోంది. రాజీనామా చేసిన ధనలక్ష్మి మొదట్లో మినీ అంగన్‌వాడీ కేంద్రంగా కొనసాగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరిలో మిని అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసేవారు. ఆ జాబితాలోనూ కొనెవారిగూడెం కేంద్రంలో ధనలక్ష్మి పేరు వచ్చింది. పీడీ కార్యాలయంలోనూ, ఆన్‌లైన్ యాప్‌లోనూ కేంద్రం టీచర్‌గా ఆమె కొనసాగుతున్నట్టు స్పష్టంగా ఉంది.

2022లో రాజీనామా చేస్తే ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో ఎలా ఉంటుంది. దీన్ని బట్టీ సీడీపీవోనే తనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాజీనామా చేయించి, లేఖ తన వద్ద ఉంచి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నట్టు స్పష్టమవుతోంది.

లేఖను ఆసరా చేసుకొని ఉద్యోగం పేరుతో డబ్బులు దండుకొంటున్నట్లు తేటతెల్లమవుతోంది. అమాయకులైన గిరిజన ఉద్యోగుల నుంచి బ్లాక్‌మెయిల్ చేసి లక్షలు దండుకొంటున్న సీడీపీవోపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

రాజీనామా చేశారు.. పోస్టు వేకెన్సి చూపినం  

గుండాల మండలం కొనెవారిగూడెం అంగన్‌వాడీ టీచర్ ధనలక్ష్మి 2022లో ఉద్యోగానికి రాజీనామ చేశారు. ఆనాడే ఆమె పోస్టును వేకెన్సీగా చూపాం. ఆ కేంద్రంలోని పిల్లలను, బాలింతలను, గర్భిణులను పక్క కేంద్రమైన గుండాలకు బదిలీ చేశాం. నేను ఎవరిని బలవంతంగా రాజీనామా చేయమని బెదిరించలేదు. ఎవరివద్ద డబ్బులు వసూలు చేయలేదు. ఒకసారి వేకెన్సీ చూపిన తర్వాత నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది. 

 మంగతాయారు, సీడీపీవో

రూ.1.50 లక్షలు తీసుకున్నారు

నాకు ఆర్యోగం బాగులేకుంటే ఆరు నెలలపాటు విధుల్లోకి వెళ్లలేదు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఏడాది క్రితం ఉద్యోగంలో చేరడానికి అనుమతి లేఖ సీడీపీవో మంగతాయారును కలిశాను. లేఖను చూసిన ఆమె.. దానిపై బలవంతంగా రాజీనామా చేస్తున్నట్టు రాయించారు. కొన్ని నెలల తర్వాత గుండాల మండలానికి చెందిన మరో అంగన్‌వాడీ టీచర్ మధ్యవర్తిగా.. రూ 1.50 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తారని చెప్పారు.

ఉద్యోగం వస్తుందన్న ఆశతో వడ్డీకి తెచ్చి రూ.1.50 లక్షలు సీడీపీవోకు ఇచ్చిన. ఆరు నెలలు గడిచినా ఉద్యోగం ఇవ్వకుండా  కార్యాలయం చుట్టు తిప్పుతూ సతాయించారు. ఆదే పోస్టును మరో వ్యక్తికి రూ.4 లక్షలు ఒప్పందం కుదుర్చుకొన్నట్లు తెలిసింది. 15 రోజుల క్రితం పీడీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొంటే ఉద్యోగం నాపేరుతోనే ఉందని చెప్పారు. సీడీపీవో మాత్రం రాజీనామా చేశాక ఉద్యోగం ఎలా వస్తుందని అంటున్నారు. నా ఉద్యోగం నాకు ఇప్పించి అధికారులు న్యాయం చేయాలి.

 ధనలక్ష్మి, అంగన్‌వాడీ, కొనెవారిగూడెం