calender_icon.png 19 March, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్‌లోకి అంగన్వాడీ ఉద్యోగులు

19-03-2025 12:16:47 AM

పోలీసులకు, అంగన్వాడీలకు మధ్య తోపులాట కలెక్టర్ హామీతో ధర్నా విరమణ 

యాదాద్రి భువనగిరి మార్చి 18 ( విజయ క్రాంతి ): నేడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఐసీడీఎస్ కి నిధులు పెంచాలని తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతరాజు జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలపై ఉద్యోగులు చేపట్టిన 48 గంటల వంట వార్పు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు కొనసాగింది. 

అంగన్వాడి ఉద్యోగులు  ర్యాలీగా బయలుదేరి  కలెక్టరేట్ గేట్ నెట్టుకుని లోపలికి చొచ్చుకొని వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, అంగన్వాడీ ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణ నెలకొంది. కలెక్టరేట్ ఛాంబర్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వేసవి సెలవులు ఇవ్వాలని , అంగన్వాడీ వ్యవస్థను ఎత్తివేయవద్దని , మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ ని ఎత్తివేయాలని , బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పి జయలక్ష్మి  మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అంగన్వాడీలకు నెలకు 18 వేలు ఇస్తామని , పి యఫ్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నదని గతంలో ఇచ్చిన హామీలను రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా  ముఖ్యమంత్రి  ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

గుజరాత్ హై కోర్ట్ ఇచ్చిన తీర్పు , సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు పేమెంట్ ఆఫ్ గ్రాట్యూటీ యాక్ట్ ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని  డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం  నూతన జాతీయ  విద్యా విధానాన్ని జూన్ నుండి అమలు చేయడం కోసం కుట్ర చేస్తుందని దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  4 వేల మంది అంగన్వాడీ టీచర్ల పది నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్  చేశారు.

అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  ధర్నా  చేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల సంఘం నాయకులను కలెక్టర్ తన  చాంబర్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంగన్వాడి ల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్. ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడానికి కృషి  చేస్తానని హామీ ఇచ్చారు.

దీంతో అంగన్వాడీలు ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం , అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బురుగు స్వప్న , చిలువేరు రామకుమారి , సిఐటియు నాయకులు మాయ కృష్ణ , కొల్లూరు ఆంజనేయులు, యూనియన్ జిల్లా నాయకులు కళ్యాణి , గంగుల రమ, పద్మ , రుక్మిణి , ప్రమీల , వసంత , సయేదా , ఉమ , జ్యోతి , శ్యామల , సునీత , సుజాత , సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.