నేడు ప్రపంచ బ్రెయిన్ డే
అనూరిజం అంటే రక్తనాళం వాపు అని అర్థం. ధమనిలోని గోడ బలహీనమైన ప్రదేశంలో ఉబ్బడం సాధారణంగా జరుగుతుంది. రక్తనాళం దెబ్బతిన్నప్పుడు లేదా రక్తనాళాల గోడలో బలహీనత కారణంగా ఇది ప్రధానంగా సంభవిస్తుంది. ధమని ఉబ్బడాన్ని అనూరిజం అంటారు. ఈ వ్యాధిని గుర్తించడం ఎలా? వ్యాధి లక్షణాలు? నివారణ చర్యలు? వంటి విషయాలను తెలుసుకుందాం..
అనూరిజం రకాలు..
ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి.
1. ఉదర బృహద్ధమని అనూరిజం.
2. థొరాసిక్ అయోర్టిక్ అనూరిజం.
3. బ్రెయిన్ అనూరిజం.
అనూరిజం లక్షణాలు..-
వీపు కింది భాగంలో నొప్పి-
మింగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు-
దవడ, ఛాతీపై భాగంలో అసౌకర్యం-
జ్వరం, ఆయాసం, బరువు తగ్గడం
రక్త నాళాల్లో ఒత్తిడి మరింత పెరిగితే ఈ సమస్యలు వస్తాయి. రక్తనాళాల్లో వాపు వస్తే గాలి బుడగలు కూడా ఏర్పడుతాయి. ఈ పరిస్థితిని అయొర్టిక్ అనూరిజంగా పిలుస్తా రు. ఈ సమస్య తీవ్రమైతే ప్రాణాంతకంగా మారుతుంది. శరీరంలోని కొన్ని కారణాలతో రక్తనాళాల గోడ బలహీన పడుతుంది. అధిక రక్తపోటుతో ఆ నాళం ఉబ్బిపోయి రెండు సెం.మీటర్లు ఉండే రక్తనాళం ఐదు సెంటీమీటర్ల దాకా పెరుగుతుంది.
చికిత్స!
వీటిని తగ్గించేందుకు శస్త్రచికిత్స చేయాల్సిందే. కొన్నిరకాల ఆపరేషన్లు ప్రమాదకరమైనవి. చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. గుండె, లివర్, కిడ్నీలకు వెళ్లే ధమనికి సమస్య వస్తే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అంతర్గతంగా తీవ్రమైన రక్తస్రావం వల్ల ప్రాణాంతకంగా మారుతుంది. ఏ విధమైన రక్తనాళాలలో అయినా అనూరిజమ్స్ ఏర్పడవచ్చు. అవి సాధారణంగా బృహద్ధమని (శరీరంలోని అతిపెద్ద ధమని), మెదడు, కాళ్లు, ప్రేగులు, ప్లీహములలో కనిపిస్తాయి. మెదడులో ఏర్పడే అనూరిజమ్స్ ఆకస్మిక మరణానికి దారి తీస్తాయి. బ్రెయిన్ అనూరిజం ఎక్కువైతే 25శాతం మంది 24 గంటలలోపు మరణిస్తారు. 50 శాతం మంది ఇతర సమస్యలతో పోరాడి మూడు నెలల్లోపే మరణిస్తారు.
ప్రమాద కారకాలు..
ధమనుల గోడలను బలహీన పరిచే వివిధ కారణాల వల్ల అనూరిజమ్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. కొన్ని సార్లు మెదడు అనూరిజం పుట్టుకతో రావచ్చు. ఇది సాధారణంగా ధమని గోడలో పుట్టుకతో వచ్చే లోపం వల్ల వస్తుంది. వీటిలో ప్రమాద కారకాలు.
అధిక రక్త పీడనం: ధమని గోడలకు వ్యతిరేకంగా రక్తం స్థిరమైన శక్తి క్రమంగా వాటి కింద చేరి, వాటిని ఉబ్బి పోయేలా చేస్తుంది.
అథెరోస్క్లెరోసిస్: ఈ పరిస్థితి ధమనుల లోపల పొరలో (కొవ్వు నిల్వలు) పేరుకుపోవడాన్ని కలిగి ఉంటుంది. ఇది రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. రక్త నాళాలల గోడను బలహీన పరుస్తుంది.
ధూమపానం: ధూమపానం రక్తనాళాలను దెబ్బతీస్తుంది.
జన్యు కారకాలు: మార్ఫాన్ సిండ్రోమ్, ఫైబ్రోమస్కులర్డిస్ప్లాసియా, ఎహ్లెర్-డాన్లోస్ సిండ్రోమ్‌లు కణజాలాలను బలహీన పరుస్తాయి. అందు వల్ల రక్తనాళాలు అనూరిజం వచ్చే అవకావం ఎక్కువగా ఉంటుంది.
వయస్సు: అనూరిజమ్స్ సాధారణంగా వయస్సుతో పాటు పెరుగుతుంది. ముఖ్యంగా 55 సంవత్సరాల తర్వాత దీని ప్రభావం ఉంటుంది. మితిమీరిన మద్యపాన వల్ల కూడా వస్తుంది.
గాయాలు: తీవ్రమైన గాయాలు రక్త నాళాలకు అనూరిజమ్స్ ఏర్పడటానికి ప్రేరేపించే అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ
మెదడు రక్తనాళాలలో అనురిజమ్స్ నిర్ధారణ సాధారణంగా CT స్కాన్లు, MRI స్కాన్లు లేదా యాంజియోగ్రామ్ల వంటి ఇమేజింగ్ పద్ధతులు ఉంటాయి.
నివారణ..-
- జీవనశైలిలో మార్పులు. అంటే ఆహారంలో ఉప్పుశాతాన్ని తగ్గించడం, వ్యాయామం చేయడం. -
- ధూమపానం మానేయడం వల్ల గుండె సంబంధ సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.-
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే పోషకాహారం తినడం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. -
- అనూరిజం లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రెగ్యులర్ చెకప్ లు చేయించుకోవాలి. సకాలంలో వైద్యాన్ని అందించడం ద్వారా వ్యాధి ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు. -
* అనూరిజం వ్యాధిని గుర్తించడం అంత సులభం కాదు. అవి పగిలిపోయే వరకు గుర్తించదగిన లక్షణాలు బయటకు కనిపించవు. అయితే తీవ్రమైన తలనొప్పి ప్రధాన సంకేతం. దీన్నే బ్రెయిన్ అనూరిజం అని చెప్పువచ్చు. ఇంకా వికారం, వాంతులు, మెడమొద్దుబారడం, దృష్టిలో లోపం, వెలుతురు సహించక పోవడం, మూర్ఛ, కనురెప్పలు పడిపోవడం, స్పృహ కోల్పోవడం లేదా అయోమయం వంటి లక్షణాలు ఉంటాయి.
డాక్టర్ ఎమ్‌ఎల్ నీహారిక
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్‌స్టార్ హాస్పటిల్,
బంజారాహిల్స్, హైదరాబాద్