23-02-2025 12:00:00 AM
ఏం తిన్నా నీరసం.. ఎప్పుడూ పడుకోవాలనిపించడం.. గుండెదడ, చర్మం పాలిపోవడం.. ఈ లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. రక్తహీనత అని తెలిసినా పట్టించుకోరు. ఆ నిర్లక్ష్యం వల్ల గుండె పనితీరు దెబ్బతిని కొన్నిసార్లు ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. మనదేశంలో 15 ఏళ్ల వయసు మహిళల్లో 57 శాతం, 15 నెలల వయసున్న చిన్నారుల్లో 67 శాతం రక్తహీనతతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం డెసిలీటరుకి 12 గ్రాముల కన్నా హీమోగ్లోబిన్ తగ్గితే రక్తహీనత. కానీ మనదేశంలో మహిళల్లో 11 గ్రాముల కంటే తక్కువ ఉంటే అనీమియాగా ఐసీఎంఆర్‌కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంది.
మనదేశంలో అయినా సగంమందికిపైగా మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల్లో రక్తహీనతను తగ్గించేందుకు నివారణ చర్యలు చేపడుతున్నాయి. వాళ్లలో అవగాహన కలిగించేందుకు కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోమని చెబుతున్నాయి. అనీమియాతో బాధపడేవారు.. ప్రతిసారి మందులు, ఇంజెక్షన్స్‌తో తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈ సమస్యను తేలికగా అధిగమించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
అసలేమిటీ అనీమియా?
నెలసరి వంటి సమస్యలు మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండేందుకు కారణమవుతున్నాయి.మన శరీరంలో ఎర్రరక్తకణాలు అన్ని అవయవాలకూ రక్తాన్ని మోసుకుని వెళ్తుంటాయి. వాటి సంఖ్య తగ్గడం వల్ల అన్ని అవయవాలకూ తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో అది ప్రమాదకరంగా మారుతుంది. రక్తహీనతల్లోనూ ఐరన్‌లోపం వల్ల కలిగేది చాలా సాధారణమైనది. మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. శరీరంలో 100 గ్రాముల రక్తంలో.. హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. ఒకవేళ ఈ హీమోగ్లోబిన్ పరిమాణం ఇంతకంటే తక్కువగా ఉంటే వారు అనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు.
మహిళల్లోనే ఎందుకు?
ముఖ్యంగా మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే.. నెలసరిలో అధిక రక్తస్రావం, ప్రసవంలోనూ రక్తం పోవడం, పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులు, గర్బధారణ సమస్యలు, జన్యులోపాలు.. వంటి కారణాలవల్ల పురుషుల్లో కన్నా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. ముఖ్యంగా గర్భిణులకు ఐరన్ ఎక్కువ మొత్తంలో కావాలి. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలూ తరచూ రక్తహీనతతో బాధపడుతుంటారు. ఈ లోపంతో బాధపడే పిల్లలకి ఏకాగ్రత ఉండదు. దాంతో ఆ ప్రభావం చదువుపై పడుతుంది. అందుకే.. మహిళలతో పాటు పిల్లలూ ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మహిళల్లో రక్తహీనతతో బాధపడేవారు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలు, కేస్ స్టడీస్ చెబుతున్నాయి.
లక్షణాలు..
అనీమియా లక్షణాలు కొందరు మహిళల్లో కాస్త తక్కువగా, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల చర్మం పాలిపోయినట్లు కనిపించడం, గోర్ల కింద రక్తం లేనట్టుగా తెల్లగా కనిపించడాన్ని అనీమియా సూచన.
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం
ఆయాసం
అలసట
చికాకు, కోపం
తలనొప్పి
నిద్రపట్టకపోవడం
ఆకలి తగ్గడం
కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు, చల్లగా మారడం
ఛాతీ నొప్పి
చికిత్స
ఐరన్ పుష్కలంగా లభించే ఆహారం అయిన కాలేయం, ఆకుకూరలు, నువ్వులు, ఖర్జూరం, అటుకులు, బెల్లం వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైనవారు డాక్టర్ సలహా తీసుకుని ఐరన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఈ ట్యాబ్లెట్లు వాడే సమయంలో కొందరికి మలబద్దకం సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి డాక్టర్ సలహా మేరకు వాడాలి. అప్పుడు డాక్టర్లు వారికి సరిపడే అనీమియా మందుల్ని సూచిస్తారు. రక్తహీనత ఎక్కువగా ఉంటే అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాలి.
ఆహారంలో..
తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి.. సోయా, శనగలు, రాజ్మా, కంది, పెసర, మినుము.. వంటి పప్పుధాన్యాలు, గోధుమలు, సజ్జలు.. వంటి తృణధాన్యాలు, చిరుధాన్యాలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి.. వంటి నట్స్, ఖర్జూరం, చికెన్, మటన్, చేపలు, పాలకూర, తోటకూర, క్యాబేజీ, బ్రోకలీ.. వంటివి ఐరన్‌కు మంచి వనరులు.
మునగాకు: ఐరన్‌కి అద్భుత ఔషధం. మునగాకు ఆకుల్ని పప్పు, పొడిరూపంలో తీసుకోవాలి. లేదూ జ్యూస్‌లా చేసుకుని రెండు స్పూన్ల రసం తాగినా మంచిదే. రక్తహీనత నుంచి త్వరగా కోలుకుంటారు. ఇక మునగ కాయల్ని కూరలు, సాంబారులో వేసుకుంటే సరి.
పచ్చిబొప్పాయి: కూర లేదా సలాడ్‌గా తినొచ్చు.
ఉసిరి: పచ్చడి, పప్పు, రసం, జామ్, జ్యూస్ చేసుకోవచ్చు. నేరుగానూ తినొచ్చు.
పచ్చిమామిడి: పచ్చడి, పప్పు, రసం, జామ్, జ్యూస్ చేసుకోవచ్చు. నేరుగానూ తినొచ్చు.
బీట్‌రూట్: కూరలు, సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకుంటే మేలు.
కరివేపాకు: తాలింపులోనే కాకుండా పొడి లేదా రోటి పచ్చడిగానూ చేసుకోవచ్చు. జిలకర, ఉప్పుతోపాటు కాస్త కరివేపాకుని మిక్సీలో వేసి పేస్టులా చేసి మజ్జిగలో కలిపి తాగినా మేలు. ఇవే కాదు జాయకాయ, పల్లీల్లోను ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇవన్నీ ఆహారంలో తరచూ తీసుకుంటే ఐరన్ లోపాన్ని చాలావరకూ అధిగమించవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు.
ఇలా ఉంటే ప్రమాదమే!
అనీమియా అనేది జనరల్ వీక్‌నెస్. అనీమియాతో బాధపడేవారు తొందరగా అలసిపోవడం.. హెయిర్ ఫాల్ కనిపించడం.. ముఖం పాలిపోయినట్టు కనిపించడం.. వైట్ డిచార్జ్ ఎక్కువగా అవ్వడం.. వంటి లక్షణాల ద్వారా అనీమియాను గుర్తించవచ్చు. కానీ ఎప్పుడైనా సరే.. డాక్టర్‌ను సంప్రదించి.. రక్త పరీక్ష చేయించుకోవాలి. దీంట్లో కూడా కొన్ని రెంజేస్ ఉంటాయి. పది కంటే తక్కువ అంటే ఎనిమిది, తొమ్మిది.. ఇలా హీమోగ్లోబిన్ స్థాయిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా తొమ్మిది, పది ఉంటే ఆహారం ద్వారా రిప్లేస్ చేసుకోవచ్చు. కానీ తొమ్మిది శాతం కంటే తక్కువగా ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తే.. ఇంజెక్షన్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే హీమోగ్లోబిన్ ఆరు శాతం కంటే తక్కువ ఉంటే మాత్రం ప్రమాదం. ముఖ్యంగా గుండెకు రక్తం సరఫరా తగ్గిపోయి.. గుండెపోటుతో మరణించే అవకాశం ఉంటుంది. అక్కడిదాక రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి.
లక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రిస్క్ అబ్‌స్టెట్రీషియన్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్