- నాట్య లెజెండ్ యామిని కృష్ణమూర్తి అస్తమయం
- అనారోగ్య కారణాలతో కన్నుమూసిన నాట్యమయూరి
- కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీకి వన్నెలు
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత యామిని కృష్ణమూర్తి (84) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచినట్టు ఆమె మేనేజర్, కార్యదర్శి గణేశ్ ప్రకటించారు. ఆమె గత 7 నెలలుగా అనారోగ్యంతో అపోలో దవాఖానలో ఐసీయూలో ఉన్నారు. యామిని కృష్ణమూర్తి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
బహుముఖ ప్రజ్ఞ
యామిని కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి సంస్కృత పండితుడు కాగా, తాత ఉర్దూకవి. సాహిత్య కారులు కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నతనం నుంచి సంగీతం, నాట్యంపై మక్కు వ పెంచుకొన్నారు. వారి కుటంబం తమిళనాడులోని చిదంబరంలో స్థిరపడటంతో అక్కడే ఆమె భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందారు. ఐదో ఏట నుంచి శిక్షణ ప్రారంభించారు. కాంచీపురం ఎల్లప్ప పిళ్లు, బాలసరస్వతి, చొక్కలింగం పిళ్లు, తంజావూరు కిట్టప్ప, దండాయుధపాణి తదితరుల వద్ద భరత నాట్యంలో శిక్షణ పొందారు. వేదాంతం లక్ష్మీనారాయణ, చింతా కృష్ణమూర్తి తదితరుల వద్ద కూచిపూడి నాట్యంలో శిష్యరికం చేశారు.
ఒడిస్సీలోనూ ఆమె ప్రావీణ్యం సంపాదించారు. పంకజ చరణ్‌దాస్, కేలూచరణ్ మహాపాత్ర వద్ద ఒడిస్సీ నేర్చుకొన్నారు. శాస్త్రీయ సంగీతంపై కూడా ఆమె పట్టు సాధించారు. రామనాథన్ వద్ద కర్ణాటక సంగీతం నేర్చుకొన్నారు. 1957లో 17వ ఏట తొలి ప్రదర్శన ఇచ్చారు. బహుముఖ ప్రజ్ఞావంతురాలైన యామిని 20 ఏండ్ల వయసు వచ్చేనాటికే ఎంతో పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. కొంతకాలానికే ఢిల్లీలో స్థిరపడ్డారు. ఆమె సుదీర్ఘ కెరీర్‌లో దేశ, విదేశాల్లో వేలకొద్ది ప్రదర్శనలు ఇచ్చారు. ఢిల్లీలో నృత్యకౌస్తుభం కల్చరల్ సొసైటీ యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇస్తున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి దేవస్థానం ఆస్తాన నర్తకిగా కూడా కొనసాగారు.
వేలకొద్దీ అవార్డులు
యామిని కృష్ణమూర్తి తన సుదీర్ఘ కెరీర్‌లో వేలకొద్ది సన్మానాలు, అవార్డులు అందుకొన్నారు. భారత ప్రభుత్వం 1968 లోనే ఆమెకు పద్మశ్రీ అవార్డును అందించింది. 1977లో సంగీతన నాటక అకాడమీ అవార్డు లభించింది. 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డు లతో భారత ప్రభుత్వం సత్కరించింది. 1971లో యామినీ కృష్ణమూర్తిపై డాక్యుమెంటరీని రూపొందించారు.
భరతనాట్యానికి కేరాఫ్ యామిని కృష్ణమూర్తి
దేశంలో భరతనాట్యానికి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత యామిని కృష్ణమూర్తి మృతి కళారంగానికి తీరని లోటు. భరతనాట్యం, కూచిపూడితో దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటిన మహానీయురాలు ఆమె. యామిని కృష్ణమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నా.
జీ కిషన్‌రెడ్డి,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి
కళారంగానికి ఆమె సేవలు ఎంతో గొప్పవి
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామిని కృష్ణమూర్తి మృతి ఎంతో బాధాకరం. కళారంగానికి ఆమె అందించిన సేవలకు 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో ఆమె రచించిన పుస్తకం అద్భుతం. ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు.
బండారు దత్తాత్రేయ, హర్యానా గవర్నర్
నేటి కళాకారులకు ఆదర్శం
ప్రముఖ నర్తకి యామిని కృష్ణమూర్తి మరణం కళారంగానికి తీరని లోటు. ఆమె నేటి తరం కళాకారులకు ఆరాధ్యనీయులు. భరతనా ట్యం, కూచిపుడి నృత్య కళకు ఆమె విశిష్ట సేవలు అందించారు. ఎంతో మంది యువతకు నాట్యం నేర్పించా రు. ప్రపంచవ్యాప్తంగా భారత శాస్త్రీ య నృత్య రీతులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి
యామిని స్కూల్ ఆఫ్ డాన్స్‌తో అనేక మందికి శిక్షణ
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి, పద్మవిభూషణ్ యామిని కృష్ణమూర్తి మరణం బాధాకరం. కళారంగానికి ఆమె అందించిన సేవలు మరువలేనివి. టీటీడీ ఆస్థాన నర్తకిగా సేవలందించిన ఆమె... యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
నృత్య ప్రపంచానికి తీరని లోటు
ప్రఖ్యాత నృతకారణి యామిని కృష్ణమూర్తి కన్నుమూయడం చాలా బాధకరం. ఆమె మరణం నృత్య ప్రపంచానికి తీరని లోటు. ఆమెను చూసే మేమంతా పెరిగాం. యామిని కృష్ణమూర్తితో నాకు సుదీర్ఘ అనుబందం ఉంది. భరత నాట్యం, కూచిపుడిలో ఆమె దిట్ట. ఆమెలా నృత్యం, అభినయం ఎవరూ చేయలేరు. ఆమెకు ఆమే సాటి. స్టేజిపైకి వచ్చారంటే ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకునేవారు. ఆమె ప్రతిభకు అనేక పురస్కారాలు వరించాయి. పద్మశ్రీ, పద్మభూషన్, పద్మ విభూషన్ అవార్డులతో యామిని కృష్ణమూర్తిని కేంద్రం గౌరవించింది.
్వతెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల