వహీదా రెహ్మాన్.. ఒకప్పటి అందాల తార. ఈ తరంవారికి ఈమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. అప్పటి తరానికి కలల రాణి. ఆమె సమ్మెహన శక్తి అలాంటిది.
వహీదా అచ్చమైన తమిళనాడు ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించింది. సినిమా అవకాశాల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఒకెత్తు అయితే.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తర్వాత ఆమె పడిన బాధ మరో ఎత్తు. ఎన్నో బాధలను, అవమానాలను ఎదుర్కొంటూనే తన సినీ కెరీర్‌లో శిఖరాలను చేరుకున్నారు.
వహీదా తండ్రి మొహమ్మద్ అబ్దుర్ రెహ్మాన్ ఉద్యోగరీత్యా ఆంధ్రలో చాలాకాలం పనిచేశారు. అలా వహీదా ‘రోజులు మారాయి’, ‘జయసింహ’ సినిమాలు విడుదలైనప్పుడు ఆయన విజయవాడలో మునిసిపల్ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. వహీదా చదివింది కూడా ఇక్కడే కాబట్టి తెలుగు బాగా వచ్చు. చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నారు.
ఎన్టీఆర్ తన ఎన్‌ఏటీ పతాకంపై నిర్మించిన మూడో సినిమా జయసింహ. అందులో రాజకుమారి పాత్రను కొత్త నటితో వేయించాలనుకున్నారు. అలా వహీదా రెహ్మాన్‌ను ఆ పాత్రకు తీసుకున్నారు. వహీదా డాన్స్ గురించి తెలుసుకున్న దర్శకుడు తాపీ చాణక్య ‘రోజులు మారాయి’ అనే మూవీలో ఒక పాటకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ‘ఏరువాక సాగారో రన్నో..’ పాట వహీదాకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
ఈ క్రమంలో దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది. ఆమె అందానికి, నటనకి ఫిదా అయిన గురుదత్ ‘సీఐడీ’ అనే సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేశాడు. అలా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 1956లో విడుదలైన ఆ చిత్రం.. అప్పటికి అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ఇండియన్ మూవీగా చరిత్రకెక్కింది.
సినిమాకు ఇస్తానన్న రెమ్యూనరేషన్‌తో పాటు అదనంగా ఆమెకు కారు కానుకగా ఇచ్చారు గురుదత్. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా.. ప్యాసా, గైడ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అప్పటికే పెళ్లయిన గురుదత్ వహీదాతో ప్రేమలో పడ్డాడు.
వహీదా రెహ్మాన్‌కు తొలి బాలీవుడ్ సినిమా ఇచ్చిన గురుదత్.. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశాడు. వహిదా కూడా అతన్ని ఇష్టపడింది. అయితే అప్పటికే గురుదత్‌కు పెళ్లి అయింది. 1953లో ప్రముఖ గాయని గీతాదత్‌ని గురుదత్ పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం వహిదాకు తెలియదు. గురుదత్ కూడా దాచి పెట్టాడు. కానీ ‘ప్యాసా’ సినిమా విడుదలకు ముందే వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలిసింది. ఒకనొక దశతో గురుదత్ భార్యకు విడాకులు ఇచ్చి వహిదాను పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి.
విఫలమైన ప్రేమ..
గురుదత్‌ని మర్చిపోవడానికి వరుస సినిమాలను ఒప్పుకుంది. నటిగా బిజీ అయింది. దేవానంద్‌తో ఎక్కువ సినిమాలు చేయడంతో అతనితో ప్రేమలో పడిందని వార్తలు పుట్టుకొచ్చాయి. 1974లో బాలీవుడ్ నటుడు శషిరేఖీని పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. 2000 సంవత్సరంలో భర్త చనిపోయాడు.
ప్రస్తుతం వహీదా ముంబైలో పిల్లలతో కలిసి ఉంటోంది. తన ఐదు దశాబ్దాల సినీ జీవితం అన్ని భాషల్లో కలిపి మొత్తం 90కు పైగా చిత్రాల్లో నటించారు వహీదా రహ్మాన్. 1971లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2023లో దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారాలు అందుకున్నారు.