- తాజాగా మండల, జెడ్పీ పాలక వర్గాలకు తెర
- ‘స్పెషల్’ పాలనకు అధికారుల ఎంపిక
- జెడ్పీ ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు
మెదక్, జూలై 5 (విజయక్రాంతి): మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాలకు శుక్రవారంతో తెరపడింది. ఇప్పటికే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండగా, మండల, జిల్లా పరిషత్‌లలోనూ ప్రత్యేక అధికారులకు బాధ్యతలను అప్పగించారు. జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ కొనసాగనుండగా.. ఎంపీపీల స్థానంలో జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు అందాయి. అయితే ప్రస్తుత పాలకవర్గాలు నిధులలేమితో ఆశించినంతగా పనులు చేపట్టకుండానే ముగిశాయి. కాగా స్వరాష్ట్రంలో మెదక్ జిల్లాలో ప్రత్యేకాధికారుల పాలన తొలిసారి కానుంది.
పూర్తి ఏజెండాపై జరగని చర్చ...
ఈ ఐదేళ్ల కాలంలో మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు 20 మార్లు నిర్వహించారు. ప్రతి సమావేశానికి పలు అంశాలతో ఎజెండా సిద్ధం చేసినప్పటికీ ఏ ఒక్క సమావేశంలోనూ పూర్తిస్థాయిలో చర్చ జరగలే దనే విమర్శలున్నాయి. అనేక అంశాలపై తీర్మానాలు చేసినప్పటికీ అమల్లో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. సమావేశాలకు ప్రజాప్రతినిధుల హాజరు సైతం అంతంత మాత్రంగానే కనిపించింది.
నిధులు, పనుల్లేకుండానే పూర్తయిన పాలన..
ప్రస్తుత జెడ్పీ సభ్యులకు పాలనాపరంగా అంతగా కలిసి రాలేదనే చెప్పవచ్చు. రెండేళ్ల సమయం కరోనాతోనే గడిచిపోయింది. మూడేళ్ల పాటు పాలన చేపట్టినప్పటికీ జెడ్పీకి అరకొరగానే నిధులు అందాయి. నాలుగేళ్ల పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా, రెండుసార్లు మాత్రమే రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. అరకొర నిధులతో జిల్లాలో మొత్తం రూ.17.96 కోట్ల పనులు మంజూరు చేశారు. ఇందులో ఇప్పటి వరకు రూ.15.35 కోట్లు విడుదల చేశారు. మిగతా పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ చట్ట సవరణ చేపట్టిన గత ప్రభుత్వం జిల్లా పరిషత్‌కు నిధుల కేటాయింపు తగ్గించింది. ఫలితంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించే అవకాశం లేకుండా పోయిందనే అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారులు
యాదాద్రి భువనగిరి/సంగారెడ్డి/రంగారెడ్డి/వికారాబాద్, జూలై 5 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ క్రాంతి వల్లూరు, రంగారెడ్డి జెడ్పీకి కలెక్టర్ శశాంక, వికారాబాద్ జిల్లా పరిషత్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ప్రతీక్ జైన్ బాధ్యతలు స్వీకరించారు.