calender_icon.png 10 January, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు ఇంగ్లండ్.. ఇటు కొలంబియా

12-07-2024 12:05:00 AM

 యూరో కప్ సెమీస్‌లో నెదర్లాండ్స్‌పై విజయం

 కోపా సెమీస్‌లో ఉరుగ్వేపై విజయం

* యూరోకప్‌లో ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2020లో రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లీష్ జట్టు ఈసారి మాత్రం చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. మూడుసార్లు యూరో చాంపియన్ అయిన స్పెయిన్‌తో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది.

డోర్ట్‌మండ్ (జర్మనీ): యూరోకప్‌లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2-1 తేడాతో నెదర్లాండ్స్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తరపున హ్యారీకేన్ (ఆట 18వ నిమిషం), ఓలీ వాట్‌కిన్స్ (90వ ని.లో) చెరో గోల్ సాధించారు. నెదర్లాండ్స్ తరఫున గ్జేవి సిమోన్స్ (7వ ని.లో) ఏకైక గోల్ నమోదు చేశాడు. వరుసగా రెండోసారి యూరోకప్ ఫైనల్లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ తుదిపోరులో స్పెయిన్‌తో తలపడనుంది. ఇక ఇంగ్లండ్ ఇప్పటివరకు యూరోకప్ గెలవలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే గ్జేవి సిమోన్స్ నెదర్లాండ్స్‌కు శుభారంభం అందించాడు. అయితే డచ్‌కు ఆనందం ఎక్కువసేపు మిగల్లేదు. పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీకేన్ గోల్ కొట్టి స్కోరును 1 సమం చేయగా.. రెండో అర్థభాగం చివర్లో వాట్‌కిన్స్ గోల్‌తో మెరిసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. 

* ప్రతిష్ఠాత్మక కోపా అమెరికా కప్‌లో 15 సార్లు చాంపియన్ అయిన ఉరుగ్వేకు షాక్ ఇస్తూ కొలంబియా ఫైనల్లో అడుగుపెట్టింది. 23 ఏళ్ల క్రితం కోపా అమెరికా టైటిల్ నెగ్గిన కొలంబియా సోమవారం జరగనున్న ఫైనల్లో  డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. 

చార్లోట్టె (నార్త్ కరోలినా): కోపా అమెరికా కప్‌లో కొలంబియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం అర్థరాత్రి జరిగిన సెమీఫైనల్లో కొలంబియా 1-0తో 15 సార్లు చాంపియన్ అయిన ఉరుగ్వేపై విజయం సాధించింది. కొలంబియా తరఫున ఏకైక గోల్ ఆట 39వ నిమిషంలో జెఫెర్‌సన్ లెర్మా సాధించాడు. సోమవారం జరగనున్న ఫైనల్లో మెస్సీ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. 2001లో కోపా చాంపియన్‌గా నిలిచిన కొలంబియా 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టడం విశేషం. ఇప్పటికే ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనా 16వ సారి కోపా అమెరికా టైటిల్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఉంది.