మదన్‌పల్లి పాత తండాలో గొడవపడుతున్న ఇరువర్గాలు
- శంషాబాద్‌లో భారీగా చేతులు మారిన భూములు
- గతంలో అన్నీ తామై వ్యవహరించినరెవెన్యూ అధికారులు
- తాజాగా మదన్‌పల్లి పాతతండాలో ‘అసైన్డ్’ వ్యవహారంలో గొడవ
రాజేంద్రనగర్, నవంబర్ 10: శంషాబాద్ మండలంలో అసైన్డ్ భూములు భారీగా చేతులు మారాయి అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములు విక్రయించేందుకు, కొనుగోలు చేసేందుకు వీలు లేదు. కానీ అధికారులు తలచుకుంటే కానిదేది లేదనే విధంగా వ్యవహరించారు. లంచాలు తీసుకొని పత్రాలను మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగానికి నేతలు కీలక పాత్రధారులుగా వ్యవహరించడంతో అసైన్డ్ భూములు చేతులు మారిపోయాయి. యం త్రాంగంలో చిత్తశుద్ధి లోపించడం నేతలకు వరంగా మారింది. అసైన్డ్ లబ్ధిదారులకు ఎంతోకొంత ముట్టజెప్పి కోట్లు విలువ చేసే భూములను చౌకగా కొట్టేస్తున్నారు. ఎప్పటికప్పుడు దృష్టిసారించాల్సిన ఉన్నతాధికారు లు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసైన్డ్ భూమిలో నిర్మాణాలు..
అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త సదరు భూమి తనదంటూ తప్పుడు పత్రాలు సృష్టించి అసలైన లబ్ధిదారులను కొన్నాళ్లుగా బెదిరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. సదరు భూమికి ప్రీక్యాస్ట్ గోడలు ఏర్పాటు చేసి లోపలి భాగంలో నిర్మాణాలు చేడపతున్నాడని ఆరోపిస్తున్నారు. సదరు భూమి తమదని.. తామే కొన్నేళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గ్రామానికి చెందిన కొఢావత్ నర్సింగ్‌తోపాటు మరికొందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం కోర్టు నుంచి సదరు భూమిలోకి ఎవరూ వెళ్లకుండా ఆర్డర్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మాజీ ప్రజాప్రతినిధి భర్తకు మద్దతుగా సదరు వివాదాస్పద భూమి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. తండావాసులను వెంటనే భూమిని ఖాళీచేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. స్థానికులను చెదరగొట్టడానికి యత్నించగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.
ఈక్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బాధితులైన తమకు న్యాయం చేయకుండా అక్రమార్కులకు వత్తాసు పలుకుతారా అని పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్ నరేందర్‌రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్ అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు.
చర్యలు తీసుకుంటాం
సర్వేనంబర్ 50లో 500 ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిందని తహసీల్దార్ రవీందర్ దత్ పేర్కొన్నారు. ప్రస్తుతం 12 ఎకరాలకు సంబం ధించి ఇష్యూ జరుగుతుందని.. సదరు భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నారని.. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు తీసుకొని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు. అసైన్డ్ భూములు అమ్మినా.. కొనుగోలు చేసినా ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని పేర్కొన్నారు.
మిగిలింది ఎకరాలే..
శంషాబాద్ మండల పరిధిలోని మదనపల్లి పాత తండాలో సర్వే నంబర్లు 50/2, 50/3, 50/4, 50/5, 50/15లో ఏళ్ల క్రితం అప్పట్లో సర్కార్ 25 ఎకరాల భూమిని కొడావత్ కుటుంబ సభ్యులకు అసైన్డ్ చేసింది. పాస్‌బుక్‌లు కూడా ఇచ్చింది. గ్రామానికి చెందిన చాలామంది ఆ భూమినే సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందుతు న్నారు. ఇదిలా ఉండగా వారిలో కొందరు హైదరాబాద్‌కు చెందిన ఇక్బాల్‌సింగ్‌కు కొంతభూమిని తమ అవసరాల నిమిత్తం విక్రయించారు. నగదు డీల్ పూర్తికాకపోవడంతో కొనుగోలుదారుడు భూమిని తన ఆధీనంలోకి తీసుకోలేదు. అందులో నుంచి కొంత భూమి విస్తరణలో పోయింది. ఇక అంతాపోను సుమారు ఎనిమిది ఎకరాలు మిగిలిపోయింది.