- నికిత పోర్వాల్‌కు అందాల కిరీటం
- తర్వాతి స్థానాల్లో రేఖాపాండే, ఆయూషీ ఢోలాకియా
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నికిత పోర్వాల్ ఈ ఏడాది మిస్ ఇండియా కిరీటం దక్కించుకుంది. ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఆమె ఈ ఘనత సాధించింది. టీవీ యాంకర్‌గా, నటిగా కెరీర్‌ను ప్రారంభించిన నికిత జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.
గతేడాది మిస్ ఇండియాగా గెలిచిన నందిని గుప్తా.. నికితకు కిరీటాన్ని అందజేశారు. దాద్రానగర్ హవేలీకి చెందిన రేఖాపాండే రెండో స్థానంలో, గుజరాత్‌కు చెందిన ఆయూషీ ఢోలాకియా మూడోస్థానంలో నిలిచారు. నెల రోజుల్లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున నికిత పాల్గొననుంది.
నికిత పాఠశాల రోజుల నుంచే మోడలింగ్‌లోకి రావాలని భావించగా ఆమె తండ్రి అశోక్ పోర్వాల్ ప్రోత్సహించాడు. స్కూల్, కాలేజీల్లోనూ తనకు మద్దతు లభించిందని నికిత తెలిపింది. అందాల పోటీల్లో రాణించాలంటే లోపలి సౌందర్యాన్ని బయటకు తేవాలని, అందుకు ధ్యానం చేయడం ఎంతో ఉపకారం చేసిందని ఈ సందర్భంగా నికిత చెప్పింది.
18వ ఏట నుంచే నటి, టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. నాటకాల మీద మక్కువతో థియేటర్ రంగంలోనూ పనిచేసింది. ‘కృష్ణలీల’ అనే నాటకాన్ని స్వయంగా రచించింది. ముంబైలో జరిగిన పోటీలకు సంగీతా బిజిలానీ, నేహా దుపియా హాజరయ్యారు.