calender_icon.png 19 November, 2024 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విష అవశేషాలతో అనర్థాలు

31-07-2024 12:00:00 AM

ఆహార భద్రత సాధనకు భారత ప్రభుత్వం 1960ల్లో ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలో నార్మన్ బోర్లాగ్ చేపట్టిన హరిత విప్లవం (గ్రీన్ రివల్యూషన్)లో భాగంగా వ్యవసాయ రంగంలో దిగుబడులను పెంచే ప్రయత్నాలు జరిగాయి. పర్యవసానంగా వివిధ రకాల పురుగు మందులు, రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. యాంత్రిక పద్ధతులు, నీటి పారుదల సౌకర్యాలు, కొత్త వంగడాల వినియోగం లాంటి సాంకేతిక విధానాలూ అమలులోకి వచ్చాయి. ఫలితంగా ఆహార ఉత్పత్తుల దిగుబడులు అధికమయ్యాయి. ఆహార అభద్రత కోరల్లోంచి మానవాళిని కాపాడడంలో సఫలతను సాధించాం. కానీ, ఇందుకు తగ్గ దుష్ఫలితాలను అనుభవించవలసి వస్తున్నది.

ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ ప్రాంతాల్లో హరిత విప్లవ ఫలితాలు గణనీయంగా నమోదయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలైన మద్దతు లభించింది. ఇదే సమయంలో అధిక పురుగు మందులు, రసాయనిక ఎరువుల అవశేషాలు ఉన్న ఆహారం మానవాళికి పెను ప్రమాదకారి అయింది. దీంతో పంజాబ్‌లో క్యాన్సర్ కేసులు శ్రుతి మించాయి. ఏకంగా ‘క్యాన్సర్ బెల్ట్ ఆఫ్ ఇండియా’గా, బటిండా ప్రాంతం ‘క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకోవడం దురదృష్టకరం. భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఎండిహెచ్, ఎవరెస్ట్ కంపెనీల మసాల పొట్లాల్లో ప్రమాదకర స్థాయిలో ‘ఇథిలిన్ ఆక్సైడ్’ గాఢతలు ఉన్నట్లు ఇటీవలి పరిశోధనలు తేల్చాయి. ఈ కంపెనీల ఉత్పత్తుల్లో పెస్టిసైడ్ అవశేషాల పరిమితులను 10 రెట్లు పెంచడం కూడా సమస్యను మరింత జటిలం చేస్తున్నది.  గత ఆరు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా రైతులు సుమారు 1,000కి పైగా వివిధ రకాల పెస్టిసైడ్స్ లేదా పురుగు మందులను వాడుతున్నట్టు తేలింది. కూరగాయలు, పండ్లు, ఇతర పంటల దిగుబడులను పెంచడానికి విపరీతమైన విషతుల్య క్రిమి సంహారక మందులు అధిక మోతాదులో వినియోగిస్తున్నారు. దీనివల్ల మానవులలో సంతానోత్పత్తి, శ్వాసకోశ, నాడీమండల వ్యవస్థలపై దుష్ఫలితాలతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులూ ఉత్పన్నమవుతున్నాయి. 

పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలను శ్రద్ధగా శుభ్రమైన చల్లని నీటితో కడగడం, సాఫ్ట్ బ్రష్‌తో శుభ్రం చేయడం, కడిగే నీటికి బేకింగ్ సోడా/ వెనిగర్/ ఉప్పు లాంటివి వేయడం మరువరాదు. పండ్లు, కూరగాయల తొక్కలను తొలగించి తినాలి. ఇంకా వీలైతే పండ్లను ఉడికించి తీసుకోవాలి. వేడినీటితో కడిగిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయడం, పలు రకాల ఆహార పదార్థాలను మార్చి మార్చి తీసుకోవాలి. వీలైనంత వరకు ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను వాడటం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పెరట్లో లేదా ఇండ్ల పైకప్పులపై పండ్లు/ కూరగాయలు స్వయంగా పండించుకోవడం వంటివీ చేయవచ్చు. ఆర్గానిక్ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితం కానప్పటికీ వాటిలో ప్రమాదకర అవశేషాల పరిమితులు చాలా తక్కువగా ఉంటాయి. కనుక రేపటి ప్రజల ఆరోగ్యానికి సురక్షిత దారులు వేసిన వాళ్లమవుతాం.  

 డా॥ బుర్ర మధుసూదన్ రెడ్డి