calender_icon.png 24 December, 2024 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూటమి పాలనలో అరాచకాలు

27-07-2024 02:29:43 AM

  1. చంద్రబాబుకు పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే దమ్ములేదు
  2. అప్పులు, ఆర్థిక పరిస్థితులపై అన్నీ అబద్ధాలే
  3. గవర్నర్‌కు లేఖలో అన్నీ వివరించా: మాజీ సీఎం జగన్

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతు న్నదని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే దమ్ములేని చంద్రబాబుకు తమ పాలనలో చేసిన అప్పులు, ఆర్థిక పరిస్థితులపై విడుదల చేసిన శ్వేతపత్రంలో అన్నీ అబద్ధాలే ఉన్నాయని చెప్పారు. అప్పులు, ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను గవర్నర్‌కు లేఖ ద్వారా తెలియజేశానని జగన్ పేర్కొన్నారు. తాడేపల్లి గూడెంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధపు శ్వేత పత్రాలు విడుదల చేసి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేని చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతోందన్నారు.

దీన్నిబట్టే రాష్ట్రంలో ఎంతటి అధ్వానమైన పాలన సాగుతోందని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను ప్రస్తావిస్తూనే వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో గవర్నక్ తెలియజేసినట్లు జగన్ వెల్లడించారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్‌బీఐ నివేదికల వాస్తవాలను పొందుపర్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు దృష్టి మళ్లింపు రాజకీయాలు చేస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విమర్శించారు.

మదనపల్లె ఘటన జరిగిన రోజు వినుకొండకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీశానని, దానిని పక్కదారి పట్టించేందుకు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనను హైలెట్ చేసుకున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిపై నిరాధారమైణ ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే స్పందించని ప్రభుత్వం.. కేసు దర్యాప్తులో ఉండగానే ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలు ప్రశాంతంగా జీవించడం లేదని జగన్ అన్నారు.