calender_icon.png 15 January, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందతాండవం

13-09-2024 12:00:00 AM

సద్గురు జగ్గీ వాసుదేవ్ :

ఈ సృష్టి ఓ నృత్యం. కాబట్టి, మనం ఆ దైవాన్ని ఒక నృత్యకారుడు అన్నాం. అతను ఒక నృత్యకారుడు కానప్పుడు అతను ఈ నృత్యం జరిగేలా ఎలా చేయగలుగుతాడు? మనం శివుణ్ణి నటరాజు అన్నప్పుడు, మనం ఆయన చేసే నృత్యం గురించి మాట్లాడటం లేదు. నటరాజ విగ్రహం చుట్టూ ఓ వృత్తం ఉంటుంది. వృత్తం అనేది ఎప్పుడూ కూడా ఈ విశ్వానికి ఓ ప్రతీక. ఎందుకంటే, ఎప్పుడైనా ఏదైనా కదిలినప్పుడు, ఈ సృష్టిలో జనించే అతి సహజమైన రూపం వృత్తం. తనకు తానుగా పుట్టేది ఏదైనా సరే ఓ వృత్తం అవుతుంది లేదా ఓ దీర్ఘవృత్తాభాసం (కొద్దిగా వక్రీకృతమైన వృత్తం) అవుతుంది. ఇందుకు కారణం ఏమిటంటే వృత్తం అనేది అతి తక్కువ ఘర్షణ కలిగిన రూపం. ఈ గ్రహం, చంద్రుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా వృత్తాలే.

ఇందువల్లే నటరాజు చుట్టూ ఉండే ఆ వృత్తం విశ్వాన్ని సూచిస్తుంది. ఆయన్ని ఎప్పుడూ ఈ విధంగానే వర్ణిస్తారు. అంటే దానర్థం ఈ విశ్వం అంతటా ఎవరో ఓ వ్యక్తి నృత్యం చేస్తున్నాడని కాదు. దానర్థం ఈ విశ్వం నృత్యం చేస్తూ ఉందని. అలాగే, ఒక విధమైన మేధస్సు ఆ నృత్యం జరిగేలా చేస్తుంది. మనం వ్యక్తిగత జీవులం కాబట్టి, అలాగే మనం అన్నింటినీ వేరు వేరైన వ్యక్తిగత జీవులుగా చూస్తాం. కాబట్టి, మన అవగాహన కోసం దాన్ని ఓ నటరాజు అనే వ్యక్తిగా చిత్రీకరించాం. శివ అనే పదానికి అక్షరాలా అర్థం ‘ఏదైతే లేదో అది’ అని. లేదా ‘ఏదైతే పదార్థం కాదో అది’ అని. అదొక పదార్థం కాదు. అదొక ఖాళీ శూన్యం, కానీ అది నృత్యం చేస్తుంది. అది నృత్యం చేస్తోంది కాబట్టే, అంతా జరుగుతోంది.

నటరాజు: శివుని అత్యంత ముఖ్యమైన రూపం

ఈ నటరాజు అనేది ప్రాథమికంగా దక్షిణ భారతదేశం నుండి ముఖ్యంగా తమిళనాడు నుండి వస్తుంది. అది ఈ సృష్టిలోని ఉత్తేజాన్ని, ఇంకా శాశ్వత నిశ్చలత నుంచి తనకు తానే సృష్టిలోకి వచ్చిన, సృష్టి అనే ఈ నాట్యాన్ని సూచిస్తుంది. మనం దేన్నయితే పరిపూర్ణ నిశ్చలత అంటామో, చిదంబరంలోని నటరాజ విగ్రహం దాన్ని సూచిస్తుంది. 

ఈ నృత్యాన్ని మీరు అవగాహన చేసుకోలేరు. ఎందుకంటే, మీరెలా అర్థం చేసుకున్నా అదొక తప్పుడు నిర్ధారణకే దారి తీస్తుంది. కానీ, మీరు ఈ నృత్యంలోని సౌందర్యాన్ని అనుభూతి చెందవచ్చు. లేదా మీరే ఆ నృత్యంగా అవ్వచ్చు. గమనించడం ద్వారా మీరు ఈ నృత్యంలోని సౌందర్యాన్ని అనుభూతి చెందితే, అప్పుడు మిమ్మల్ని ‘సాధకుడు’ అంటారు. సమాజం వారిని వేరే పేర్లతో పిలవొచ్చు.  ఉదా॥కు వారిని శాస్త్రవేత్తలు అనొచ్చు. అయినా సరే వారు సాధకులే. దాని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి, మీరు ధ్యాస పెట్టి గమనిస్తున్నారు. మీరు ఆ నృత్యంగా మారితే, మీరు ఆ దైవం అవుతారు, ఓ యోగి అవుతారు. మీకున్న ఎంపిక ఇదే.

ఈ నృత్యం ఎంత ఖచ్చితంగా ఉంటుందంటే, దాదాపు మనం ఇక ఆ నృత్యకారుడి గురించి మర్చిపోతాం. కానీ, నృత్యకారుడు లేకుండా నృత్యం ఉండదు. మన దృష్టి ఇంకా మన ధ్యాస, పై పైనే ఉంటాయి, కాబట్టి, మనం ఈ నృత్యాన్ని అవగాహన చేసుకోలేం. ఈ నృత్యంలో, నృత్యకారుడిని కనుగొనాలంటే, ఓ మార్గం ఏమిటంటే, మీరు ఆ నృత్యంలో లీనమవాలి. మీరిక వీక్షకులు కాక మీరే ఆ నృత్యం అవ్వాలి. అప్పుడు మీరు అనుభవ పూర్వకంగా ఆ నృత్యకారుడిని తెలుసుకుంటారు.

ఆయనచే తాకబడతారు. కానీ, ఈ నృత్యకారుడిని పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే, ఈ నృత్యం మూలాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఈ నాటకం అంతటికీ ఆధారమైన వాడిని తెలుసుకోవాలని అనుకుంటే, ఓ విధంగా ఈ నృత్యానికి దూరంగా ఉంటూనే, పరిపూర్ణమైన ధ్యాస పెట్టగలగాలి. ఇవి రెండూ చూడడానికి పరస్పర వైరుధ్యాలుగా అనిపిస్తాయి. ఓ స్థాయిలో ఆ నృత్యంలో మునిగిపోవాలి. మరో స్థాయిలో ఆ నృత్యాన్ని అత్యంత తీక్షణతతో గమనించగలగాలి. ఇవి పరస్పర వైరుధ్యాలు కాదు. కాకపోతే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, ఒక్కొక్క ముక్కని వేరువేరుగా చూసినప్పుడు ప్రతిదీ వైరుధ్యంతో ఉన్నట్టు కనిపిస్తుంది.

సాన్నిధ్యాన్ని చేరుకోవడం!

తెలుసుకునేందుకు ఓ మార్గం, ఈ నృత్యంలో, ఈ నాటకంలో పూర్తిగా నిమగ్నమవ్వడం. లేదా మరో మార్గం ఏమిటంటే, మిమ్మల్ని మీరు ఈ నాటకం నుండి దూరంగా ఉంచుకొని, ఇందులో ఏ మాత్రమూ నిమగ్నమవకుండా ఉండి, దానిని పూర్తిగా గమనించగలగడం. అప్పుడు ఈ నాటకానికీ, నాటకం ఆడుతున్న వాడికీ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోగలుగుతారు. నృత్యానికీ, నృత్యం చేస్తున్న వాడికీ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోగలుగుతారు. రెండో మార్గం ద్వారా తెలుసుకోవాలంటే, అందుకు చాలా ఎక్కువ ఎరుక, చురుకుదనం, తీక్షణత, ఇంకా శిక్షణ అవసరం. కాబట్టి, దానికంటే ఈ నృత్యంలో భాగమవడం అనేది తేలికైన మార్గం. నెమ్మది నెమ్మదిగా ఆ లయ పెరిగేకొద్దీ, మీరు మరింత మరింత లోనికి లాగబడతారు. ఏదో ఒక రోజున ఏది మీరో, ఏది ఈ నృత్యమో, వాటిమధ్య వ్యత్యాసం మీకిక తెలీదు. ఓసారి మీరు ఈ నృత్యంలో భాగమయ్యాక, ఆ నృత్యకారుడి సాన్నిధ్యాన్ని మీరు తప్పించుకోలేరు.