calender_icon.png 16 January, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్స్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా

06-08-2024 02:10:30 AM

న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు

  1. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన
  2. కొద్ది రోజుల్లోనే బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్కిల్స్ వర్సిటీకి చైర్మన్‌గా వ్యవహరించడానికి ఆనంద్ మహీంద్రా అంగీకరించారని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే బాధ్యతలు స్వీకరి స్తారని స్పష్టంచేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటించారు.

ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్‌లో సీఎంతో సమావేశమైన సందర్భంలోనూ స్కిల్స్ వర్సిటీపై చర్చలు జరిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని బ్యాగరికంచె వద్ద వర్సిటీ భవనానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఇందులో 17 రకాల కోర్సుల్లో ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణనిచ్చి, సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటుచేశారు. సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్‌సీఐ) భవనం నుంచి వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. 

ఆనంద్ మహీంద్రానే ఎందుకు?

తెలంగాణలోని స్కిల్స్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రానే ఎందుకు... ఆయన వల్ల యూనివర్సిటీకి, యువతకు ఏవిధమైన లాభం చేకూరుతుందనే అంశంపై చర్చ మొదలైంది. అయితే 1945లో ప్రారంభమైన మహీంద్ర గ్రూప్ సంస్థ ప్రస్తుతం ప్రపం చ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి పేరుగాంచింది.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆయా దేశాల్లో 22 రంగాల్లో 2.60 లక్షల మందికి  ఉపాధినిస్తున్నది. స్కిల్స్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహరించడం ద్వారా ఇక్కడ శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించడంలో మహీంద్రా గ్రూప్ భాగస్వామ్యం ఉండేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.

22 రంగాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆనంద్ మహీంద్రా అనుభవం కూడా విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిలో కూడా కొంత మేర ఉపయోగపడనున్నది. దీంతోపాటు ఏటా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి మహీంద్రా గ్రూప్ సంస్థల్లో ఉద్యోగాలు లభించడం సులభతరం అవుతుంది. 

ఆయా రంగాల్లో.. మహీంద్రా

ఎయిరో స్పేస్, ఆఫ్టర్ మార్కెట్, అగ్రిబిజినెస్, ఆటోమోటివ్, కాంపోనెంట్స్(విడి పరికరాలు), కన్సల్టింగ్, డిఫెన్స్, ఎడ్యుకేషన్, ఎనర్జీ, వ్యవసాయ పరికరాలు, ఫైనాన్షియల్, హాస్పిటాలిటీ, ఇండస్ట్రీయల్ పరికరాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లాజిస్టిట్స్, లగ్జరీ బోట్స్, ఈ రియల్ ఎస్టేట్, రిటైల్, స్పోర్ట్స్, మీడియా.