- స్వదేశానికి భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్
- అభిమానుల ఘనస్వాగతం
ఫొగాట్ కంటతడి.. ధైర్యం చెప్పిన సాక్షి, బజరంగ్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వదేశానికి చేరుకుంది. శనివారం ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వినేశ్‌కు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ‘వినేశ్.. నువ్వు మా రియల్ హీరో’ అంటూ అభిమానులు ఫొగాట్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. పతకం తేలేకపోయినా దేశం మొత్తం తనకు అండగా నిలవడం చూసి వినేశ్ ఫొగాట్ కన్నీటిపర్యంతమయ్యింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూనే తనకోసం తరలివచ్చిన అశేష అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
వినేశ్‌ను స్వాగతించేందుకు తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా సహా రాజకీయ నాయకులు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. తన అమ్మ ప్రేమలతను కలుసుకున్న వినేశ్ కన్నీటి పర్యంతమవ్వగా.. సాక్షి మాలిక్, భర్త సోమ్‌వీర్ ఆమెను ఓదార్చారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో వినేశ్ ఢిల్లీ నుంచి హర్యానాలోని స్వగ్రామం బలాలికి ఊరేగింపుగా బయల్దేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ రహదారి పొడవునా వినేశ్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
ఆమెపై పూలవర్షం కురిపిస్తూ.. ‘రియల్ హీరో’ అంటూ అడుగడుగునా వినేశ్‌కు నీరాజనం పట్టారు. తనపై అభిమానుల చూపించిన ప్రేమను తట్టుకోలేకపోయిన వినేశ్ పలుమార్లు కంటతడి పెట్టగా.. సాక్షి మాలిక్, బజరంగ్ ఆమెకు ధైర్యం చెప్పారు. ఢిల్లీలోని ద్వారక టెంపుల్ దర్శనం అనంతరం అదే వాహనంలో స్వగ్రామమైన బలాలికి చేరుకుంది. బలాలిలోనూ వినేశ్‌కు ఘన స్వాగతం లభించింది.
* నాకోసం తరలివచ్చిన అభిమానులకు పేరుపేరునా ధన్య వాధాలు. నేను చాలా అదృష్టవంతురాలిని. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ముందు వెయ్యి బంగారు పతకాలైనా తక్కువే.
వినేశ్ ఫొగాట్, భారత రెజ్లర్
ప్రయాణం ముగిసిపోలేదు..
పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకున్న వినేశ్ అనర్హత వే టు కారణంగా తృటిలో పతకం కోల్పోయిన సంగతి తెలిసిందే. వంద గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ పతక పోరుకు దూరమయింది. దీంతో వినేశ్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికి షాక్‌కు గురి చేసింది. అయితే తనపై అనర్హత వేటును సవాల్ చేస్తూ వినేశ్.. కోర్ట్ ఫర్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్)కు అప్పీల్ పెట్టుకుంది. కనీసం తనకు రజతమై నా ఇవ్వాలని అప్పీల్‌లో పేర్కొంది. కాస్ తీర్పు తనకు అనుకూలంగా వస్తుందేమోనని భావించిన వినేశ్ పారిస్‌లోనే ఉండిపోయింది. కానీ పలుమార్లు తీర్పును వాయి దా వేసిన కాస్ చివరకు వినేశ్ అప్పీల్‌ను తిరస్కరిస్తూ అభ్యర్థనను కొట్టేసింది. భారత్‌కు బయల్దేరే ముందు వినేశ్ ‘ఎక్స్’ వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టింది. ‘ఇక్కడితో నా ప్రయాణం ముగిసిపోలేదు. ఇది నా సమ యం కాదు. కోట్లాది భారతీయులు, నా కు టుంబం నాపై పెట్టుకున్న లక్ష్యం నెరవేరలేదు. 2032 వరకు రెజ్లింగ్ ఆడే సత్తా నాలో ఉందనుకుంటున్నా. భవిష్యత్తు ఎలా ఉం టుందనేది ఇప్పుడే చెప్పలేను’ అని పేర్కొనడంతో వినేశ్ తన రిటైర్మెంట్‌పై వెనక్కి తగ్గినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అమ్మను తలచుకొని..
‘నాన్న అకాల మరణం తర్వాత అమ్మ క్యాన్సర్ బారిన పడింది. తాను చనిపోతానని తెలిసినా ఏనాడు ఆ బాధ తెలియ కుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ‘చనిపోతానని ఎప్పుడు చెప్పొద్దు. పోరాడు తూనే ఉండాలి’.. అని అమ్మ చెప్పిన మాటలు నా చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి. అందుకే జీవితంలో బతకాలంటే పోరాడాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మ పట్టుదలే అందుకు కారణం. ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలని అమ్మ చెప్పిన మాటలు నాలో ధైర్యాన్ని నూరిపోశాయి’అని ఫొగాట్ వెల్లడించింది. ‘సోమ్‌వీర్ నా భర్తగా కంటే గొప్ప స్నేహితుడని చెప్పుకుంటా’ అని పేర్కొంది.