calender_icon.png 1 March, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారిక కార్యాలయంలో అనధికారిక ఎమ్మెల్యే...

18-02-2025 06:56:33 PM

కులగణనపై అధికారులతో సమీక్ష....

పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాల లక్ష్మీ...

అధికారులకు దిశానిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్..

రబ్బర్ స్టాంప్ గా మున్సిపల్ కమీషనర్ త్రిళేశ్వర్ రావు....

మేడిపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేను పూర్తి స్థాయి నిర్వహించి క్షేత్ర స్థాయిలో వివరాలను పొందుపరచాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మీ అన్నారు. మంగళవారం నాడు మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ కార్పొరేషన్ కార్యాలయంలో కుల గణనపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మీ, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్యూనరెటర్లు, వార్డ్ అధికారులకు సర్వేకు సంబంధించి దిశ నిర్దేశం చెయ్యాలని కమిషనర్ త్రిలేశ్వర్ రావుకు సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధికారిక కార్యాలయంలో ఏ హోదాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమీక్షలు నిర్వహిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఉత్తమ మున్సిపల్ కమీషనర్ గా అవార్డు అందుకున్న త్రిళేశ్వర్ రావుకు అధికారిక ప్రోటోకాల్ తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

పురపాలనలో అధికార పార్టీ నాయకుల పెత్తనం....

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పురపాలన పదవీకాలం ముగియడంతో ఆయా మున్సిపాలిటీలలో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుంది. అలాంటి సమయంలో అధికారిక కార్యక్రమాలలో ముఖ్య అతిధులుగా స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ లేదా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొని సమీక్షలు నిర్వహించడం ఆనవాయితీ కాని అందుకు  విరుద్ధంగా ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం సర్వత్రా చర్చకు దారితీసింది. స్థానిక మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుగుణంగా పనులు చక్కదిద్దుకోవడం పరిపాటిగా మారింది.

కనీసం నగరపరిధిలో అనదికారికంగా ఏర్పాటు చేసిన అధికార పార్టీ ఫ్లెక్సీలు సైతం తీయడానికి మున్సిపల్ కమీషనర్ జంకుతున్నారని, అక్రమ నిర్మాణాలు,అనధికారిక సెల్లార్లు విచ్చలవిడిగా కొనసాగుతున్న ఫిర్యాదులు  చేసిన కేవలం నోటీసులతో కాలయాపన చేస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికార పార్టీ నాయకుల చేతిలో మున్సిపల్ కమీషనర్ రబ్బర్ స్టాంప్ గా మారారని ప్రతిపక్షాలు,ప్రజల్లో జోరుగా చర్చజరుగుతుంది.