calender_icon.png 6 May, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరపురాని సాహితీ స్రష్ట

23-03-2025 12:00:00 AM

ప్రొ. ఎస్.లక్ష్మణమూర్తికి శ్రద్ధాంజలి :

మాడభూషి శ్రీధర్

సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో అద్భుత పాండిత్యం కలిగిన గొప్ప ఉపాధ్యాయుడు, ప్రసంగకర్త, పండితుడు ప్రొఫె సర్ ఎస్. లక్ష్మణ మూర్తి  శనివారం ఉద యం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో  తన కుమార్తె నివాసంలో పరమ పదించారు. గత వారం నుంచి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నిరాడంబరమైన జీవనాన్ని నడిపిన ప్రతిభావంతుడు. తనకోసం ఇంకా ఏదో కావాలని ఎప్పుడూ అనుకోలేని మంచి వారు. తన అనితర సాధ్యమైన వరంగల్లు జీవనంలో ఒక సేవా భావంతో చిరస్మరణీయ ముద్ర వేశారు లక్ష్మణమూర్తి.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సం స్కృతంలో ఎంఏ  చదివి హైదరాబాద్‌లో సంస్కృతంలో అధ్యాపకుడుగా మూడు సంవత్సరాలు పని చేసారు. ఆ తరువాత ఆంగ్ల భాషలో ప్రయివేట్‌గా చదువుకుని యూనివర్సిటీ అత్యధిక మార్కులు తెచ్చుకుని ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చర ర్‌గా చేరి, వరంగల్ పోస్ట్టు గ్యాడుయేట్ సెంటర్‌కు బదిలీ అయిన తరువాత ప్రము ఖ ప్రొఫెసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

స్వయంగా మూడు భాషలలో స్కాలర్ అయిన లక్ష్మణమూర్తి డజనుమందికి పిహెచ్‌డి, ఎంఫిల్ పరిశోధన మార్గదర్శిగా నడిపించారు.  సాహిత్యంపై చాలా వ్యాసా లు రచించారు. కాకతీయ యూనివర్సిటీ లో చాలా అనేక విద్యావిషయ పాలనా బాధ్యతలను విధులను చేపట్టి  తన దైన ముద్ర వేసాడు. ఆరంభంలో హనుమకొండ మిత్ర మండలి చేర్చారు.

కాళోజి నారాయణ రావు, కాళోజి రామేశ్వర్ రావు, కోవెల సుప్రసన్నాచార్యులు, అనుముల కృష్ణమూర్తి వంటి ప్రముఖులకు చాలా సన్నిహితుడు. వరవర రావు, అంపశయ్య నవీన్, బిరుదు రామరాజు, వేమ నరసింహారెడ్డి, గంట రామిరెడ్డిలకు దగ్గరి మిత్రుడు. మంచి మనిషి, మంచి మిత్రు డు, గొప్ప పండితుడు. వరంగల్ లో అన్ని సాహితీ, సాంస్కృతిక సంస్థల్లో వారి ముద్ర ఉన్నవారు. 

అద్భుతమైన వ్యక్తిత్వం

అత్యంత సరళమైన జీవనశైలిని అనుసరించిన ప్రొఫెసర్ మూర్తి గారు, హాస్యం, లోతైన విమర్శ, తికమకలేని నిజాయితీతో ప్రసిద్ధి గాంచారు. ఆయన ప్రసంగాలు ప్రేరణాత్మకమైనవి, ఆలోచనాత్మకమైనవి. గొప్ప రచయితగా, ముఖ్యంగా భగవాన్ శ్రీకృష్ణుని గూర్చి తెలుగులో అనేక విలువైన గ్రంథాలు రచించారు. అదనంగా, వందలాది పుస్తకాల ముందుమాటలు, విమర్శలు, పుస్తకాలను ఎడిట్ చేయడం చేసారు.

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నా, అడిగిన వారందరికీ వీలైనంత శక్తి వున్నంతవరకు పుస్తకాలను సవరించి, దిద్దితీర్చిన వారు. తనకు ఎటువంటి కృతజ్ఞతకూ, గుర్తింపుకూ, ధనానికి ఆశపడ కుండా ఒక మామూలు జీవితం నడిపా రు. ఆయన నిజాయితీ, దయ, కుటుంబానికి అంకితభావం కలిగిన వ్యక్తి. భార్య ప్రొఫెసర్ జయశ్రీ, తన ఇద్దరు కుమార్తెలు,  ఏకైక కుమారుడు, అల్లుళ్లకు దగ్గరుండి ప్రేమాభిమానలను పంచి పెట్టారు.

విద్యార్థులకు తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపా ధ్యాయులు, సమాజంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని నిరంతరం బోధిం చారు. మిత్రులు, శిష్యులు, పరిచితులు, పాఠాలు చెప్పినా, కాలేజీలో చేరకపోయి నా అనేకానేక మందితో ఆయన ఎంతో అభిమానంతో ఎన్నో విషయాలు చెప్పేవారు.

అంతర్జాతీయ గుర్తింపు

1984లో, ప్రొఫెసర్ మూర్తి గారు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ పొందారు. అమెరికా లోని డ్యూక్ యూనివర్సిటీ, మిస్సోరి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి పరిశోధన చేసి ప్రసంగాలు చేసారు. అదే సంవత్స రం, కాకతీయ జర్నల్ ఆఫ్ ఇంగ్లిష్ స్టడీస్‌కు ఎడిటర్‌గావ్యవహరించి, ‘ఆధునిక భారతీయ సౌందర్యశాస్త్ర చింతన’ అనే అంశం పై రచనలు చేశారు. 

ఆయన పుస్తకాలు కొన్ని అంతర్జాతీయ గ్రంధాలయాల్లో కనపడిన చూసిన పిల్లలు, మనవలు చూసి సంతోషించి లక్ష్మణమూర్తిగారికి చెబితే ‘ఏముంది అందులో’ అని వదిలేసేవారు. ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యంగా వరంగల్లు సాహితీ సభలలో, తదితర సాంస్కృతికి, సభాసమావేశాలలో ఆయన ప్రసంగాలు ఆకట్టుకునే వారు.

ఆయన సున్నితంగానే వ్యంగ్యం విమర్శ తెలిపేవారు. ఓసారి  2016 సెప్టెంబర్ 15న ఆయన ప్రజలకు సంస్కృతాన్ని నేర్చుకోవాలని ఉద్బోధించారు. ఎందుకంటే ఇంత అద్భుతమైన అనుభూతిని కలిగించే భాష మరొకటి లేదు అని ఆయన పేర్కొన్నారు.

వేదాలు, ఉపనిషత్తులు మరియు హిందూ ధర్మశాస్త్రాలలోని నైతిక విలువలను పాటించాలని సూచించారు. భారతదేశ సంపదపై గర్వించాలనీ, ఆది శంకరాచార్యులు,  కాళిదాసు రచనల నుండి ఉదాహరణలు ఇచ్చి, శరీర శుద్ధి, మనస్సు శుద్ధి అత్యవసరమని ఆయన బోధించారు.

విద్యార్థులకు బంగారు మాటలు

2018 జనవరి 11న జరిగిన కార్యక్రమంలో, విద్యార్థులు తమ జీవితంలో ఓ గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని, వారి బాటలో నడవాలని అన్నారు. స్వామి వివేకానందుడు ‘దివ్యమైన ప్రసంగకళా సామ ర్థ్యంతో ఉన్న గొప్ప వక్త’ అని పేర్కొన్నా రు. ‘మీ విద్యామాధ్యమం (తెలుగు లేదా ఆంగ్లం) మీ విజయానికి ఆటంకం కాలేదు. నేనూ తెలుగు మీడియం విద్యార్థినే, కానీ ఆంగ్లాన్ని నేర్చుకుని ఆంగ్ల భాష ఉపాధ్యాయుడిగా మారాను’. ఎన్ని సమస్యలున్నా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అవి జీవితాన్ని నాశ నం చేస్తాయని విద్యార్థులకు హెచ్చరించారు.

2013లో, ప్రొఫెసర్ మూర్తి గారు ప్రఖ్యాత తెలుగు కవి వానమామలై వరదాచార్యులు రచనను ఆంగ్లంలోకి అనువ దించారు. ఈ గ్రంథం భక్త పోతనపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన శ్రీనివాస బాల భారతి గ్రంథమాలలో భాగంగా పిల్లల కోసం రూపొందించబడింది. ఇలాంటి అనేక అనువాద  సాహి త్య ప్రాజెక్టులలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. లెక్కలేని రచనలు ఉన్నాయి. తన పేరుకూడా చెప్పడం అన్నా పెద్దగా ఇష్టపడేవారు కాదు. 

మరిచిపోలేని ఉపాధ్యాయుడు

మానవహక్కుల పోరాటం చేస్తున్న ప్రముఖ రచయిత జీవన్ కుమార్ ఆంగ్లభాషలో తనకు ప్రొఫెసర్ లక్ష్మణమూ ర్తిగారు చెప్పిన పాఠాలు మరిచిపోలేము అన్నారు. విద్యార్థులతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన సునిశితమైన వ్యంగ్యాన్ని ప్రదర్శించేవారు అంటూ ఆయనను కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశా రు.

‘లక్ష్మణ మూర్తి సార్, నా ప్రియమైన గురువు, మీ సమక్షంలో గడిపిన రోజులను తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు. నిన్ననే మీ తరగతిలో కూర్చున్నట్టు అనిపిస్తోంది. కానీ, ఈ రోజు మీరు లేరు.  నేను ప్రపంచమంతా వెతికాను. కానీ, లక్ష్మణ మూర్తి సార్, మీ వంటి మరొకరిని ఎక్కడా చూడలేదు’  అని అన్నారు. 

(నేను ఆయన విద్యార్థిని 

కాకపోయినా, ప్రొఫెసర్ మూర్తి గారు నన్ను తన శిష్యుడిగా భావించి 

మార్గదర్శనం చేశారు.)