calender_icon.png 30 October, 2024 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊహించని ఫలితం

03-08-2024 01:34:59 AM

  1. రాణించిన రోహిత్, అక్షర్ 
  2. ఆదివారం రెండో వన్డే

కొలంబొ: శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు వన్డే సిరీస్‌లో మాత్రం ఊహించని ఫలితం ఎదురైంది. కొలంబో వేదికగా శుక్రవారం భారత్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. దునిత్ వెల్లలాగే (65 బంతుల్లో 67 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాతుమ్ నిసాంక (75 బంతుల్లో 56; 9 ఫోర్లు) అర్థసెంచరీతో రాణించాడు.

లంక బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, దూబే, వాషింగ్టన్, కుల్దీప్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతం లక్ష్య ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. రోహిత్ శర్మ (47 బంతుల్లో 58; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థసెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (57 బంతుల్లో 33) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో హసరంగా, అసలంక చెరో 3 వికెట్లు పడగొట్టారు. నిబంధనల ప్రకారం వన్డేల్లో సూపర్ ఓవర్ లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ టై అయినట్లు ప్రకటించారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. 

నిలకడలేమి బ్యాటింగ్

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేయగలిగింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో లంకకు పరుగులు రావడం కష్టమైంది. ఒక ఎండ్‌లో నిసాంక నిలబడినప్పటికి అతనికి సహకరించేవారు కరువయ్యారు. నిసాంక అర్థసెంచరీ చేసి వెనుదిరిగిన తర్వాత వెల్లలాగే ఇన్నింగ్స్ బాధ్యతను తనపై వేసుకున్నాడు. ఉన్నంతసేపు హిట్టింగ్‌కు ప్రాధాన్యమిచ్చిన రోహిత్ అర్థసెంచరీ సాధించాడు.

కోహ్లీ 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలకడగా ఆడడంలో విఫలమయ్యారు. మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబేలు రాణించడంతో భారత్ విజయం వైపుగా సాగింది. చివర్లో ఒక్క పరుగు చేయాల్సిన దశలో దూబే ఔట్ కావడం భారత్‌ను ముంచింది. తర్వాత వచ్చిన అర్ష్‌దీప్ అనవసర షాట్‌కు యత్నించి వికెట్ పారేసుకోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.