18-03-2025 12:00:00 AM
ఇండస్ట్రీలో జయాపజయాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. గతంలో పలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న ఆయన తర్వాత తీసిన సినిమాలు మిశ్రమ ఫలితాల్నే ఇచ్చాయి. గత ఏడాది ‘డబుల్ ఇస్మార్ట్’ అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఆ తర్వాత ఎలాంటి కొత్త ప్రాజెక్టునూ పూరీ ప్రకటించలేదు. అయితే, తాజాగా ఆయన నుంచి రానున్న సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
తమిళ నాట వరుస విజయాలతో దూసుకుపోతున్నారు స్టార్ హీరో విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ చేతులు కలుపనున్నట్టు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అనూహ్య కలయికపై అంతటా ఆసక్తి నెలకొందిప్పుడు.
ఇప్పటికే విజయ్ సేతుపతికి కథ కూడా చెప్పేశారట పూరీ. సింగిల్ సిట్టింగ్‌లోనే స్ట్రిప్ట్‌ను ఓకే చేసిన సేతుపతి.. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలన్నీ పక్కన పెట్టేసి పూరీకి కాల్ షీట్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఏదీ ఇప్పటివరకు రాలేదు కానీ.. అన్నీ కుదిరి, ఈ ఆసక్తికరమైన కలయిక సెట్స్‌లోకి వెళితే మాత్రం హిట్ పక్కా అంటున్నారు నెటిజన్లు.