08-04-2025 12:00:00 AM
జనగామ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాణాపురం ఇందిరమ్మ కాలనీ వద్ద నిర్మిస్తున్న బైపాస్ రోడ్ లో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షతన ధర్నానుద్దేశించి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు మాట్లాడారు.
నేషనల్ హైవే అథారిటీ అధికారుల అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందన్నారు. అండర్ పాస్ నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో బాణాపురం ఇందిరమ్మ కాలనీ వద్ద 72 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారన్నారు.
వివిధ గ్రామాలకు లింకు రోడ్డుగా, ప్రధాన రహదారిగా ఉన్న బాణాపురం రోడ్డులో అండర్‌పాస్ నిర్మిస్తేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ నెల 11 వరకు దీక్షా శిబిరం వద్దకు వచ్చి జిల్లా ఉన్నత అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేదంటే జాతీయ రహదారిని వందలాది మందితో సీపీఎం ఆధ్వర్యంలో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బొట్ల శేఖర్ , బూడిద గోపి, సుంచు విజేందర్, బోడ నరేందర్, భూక్య చందు నాయక్, చిట్యాల సోమన్న, ఎండీ.అజారుద్దీన్ , బిట్ల గణేష్ , ఎండి. దస్తగిరి, కల్యాణం లింగం, బాల్నే వెంకటమల్లయ్య, పల్లెర్ల లలిత, మంగ బీరయ్య, బొట్ల శ్రావణ్ , బూడిది ప్రశాంత్, పాముకుంట్ల చందు, ధరావత్ మహేందర్ పాల్గొన్నారు.