calender_icon.png 12 March, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీరు మారని అధికార యంత్రాంగం

12-03-2025 12:39:49 AM

  • జిల్లాలో వరుస ఏసీబీ దాడులు డబ్బులు పెట్టి వచ్చాం తప్పదంటున్న అధికారులు 
  • ఏసీబీని ఆశ్రయించే యోచనలో బాధితులు

జగిత్యాల, మార్చి 11 (విజయక్రాంతి): ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ఓ రోజు సాయంత్రం ఏసీబీ అధికారులు ఒక ప్రభుత్వ అధికారిని పట్టుకున్న విషయం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నప్పటికీ, ఇదేదీ పట్టించుకోకుండా మరుసటి రోజే మరో అధికారి అక్రమాలకు తెరలేపి ఏసిబికి పట్టు పడడం గమనార్హం.

ఇది జిల్లాలో ఉన్న ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి, ’మాకేమవుతుంది లే’ అన్న మొండి ధైర్యానికి ఉదాహరణగా పలువురు అభివర్ణిస్తున్నారు. జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో ఎస్త్స్ర, తెల్లారే ధర్మపురి నియోజకవర్గంలో కమిషనర్ అవినీతి నిరోధక శాఖకు ’రెడ్ హ్యాండెడ్’గా పట్టుబడడం ప్రజల్లో ఇలాంటి చర్చలకు దారితీసింది. కోరుట్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్త్స్ర శంకర్ పేకాటలో పట్టుబడ్డ ఓ వ్యక్తికి సెల్ఫోన్ తిరిగి ఇవ్వడానికి గానూ రూ. 5 వేలు డిమాండ్ చేయగా, సదరు బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి మరి కొద్ది నెలల్లో రిటైర్ కానున్న ఎస్త్స్రని పట్టించాడు.

ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతుండగానే, ప్రజలు మరిచిపోక ముందే, మరో ఘటన జరగడం అవినీతి అధికారుల తెగింపుకు పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ధర్మపురి మున్సిపల్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి పెండింగ్లో ఉన్న జీతం మంజూరు చేయడం కోసం కమిషనర్ శ్రీనివాస్ రూ. 20 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ రెండు ఘటనలే కాకుండా జిల్లాలో పలు సంఘటనలు అతికొద్ది కాలంలోనే జరగడం గమనార్హం.

అదే కోరుట్ల నియోజకవర్గం లోని మెట్పల్లి అటవీ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి అక్రమ కలప సరఫరా కోసం ఓ వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఇదే కోవలో అంతకుముందు ఓ ఎక్సైజ్ అధికారి అక్రమ మద్యం వ్యాపారి వద్ద మామూలు తీసుకుంటూ పట్టుబడడం గమనార్హం. ఇదే కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి సబ్ రిజిస్టర్ అధికారి అసిబాద్దీన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నప్పటికీ జిల్లాలో ప్రభుత్వ అధికారుల పని తీరు మారకపోవడం, అక్రమ వసూళ్ల దందా ఆగక పోవడం శోచనీయం. పైపెచ్చు కొందరు ప్రభుత్వ అధికారులు మేమేం చేయాలండి.. పోస్టింగ్ కోసం లక్షలాది రూపాయలు ముట్ట చెప్పాం కదా.. అవి ఎలా రాబట్టుకోవాలి.. అప్పులు ఎలా కట్టాలి... అని బహిరంగంగా చర్చిస్తుండడం గమనార్హం.

మంచి పోస్టింగ్ కోసం ప్రజా ప్రతినిధులకు, ఆయా శాఖల ఉన్నత అధికారులకు ముడుపులు అప్పజెప్పడం ఇటీవల ఆనవాయితీగా మారిందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీరుమారని అవినీతి తిమింగలాల పని పట్టడం కోసం కొందరు బాధితులు ఏసీబీ అధికారులను ఇప్పటికే ఆశ్రయించి, మరికొందరు ఆశ్రయించే దారిలో ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో జరుగుతున్న అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసే దిశలో ’దిద్దు బాటు’ చర్యలకు శ్రీకారం చుడితే బాగుంటుంది.