హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో ఓ ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. సోమవారం సిద్ధిపేట నుంచి హనుమకొండకు వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ డిపోకు చెందిన బస్సు 70 మంది ప్రయాణికులతో సిద్దిపేట నుంచి హనుమకొండకు వస్తోంది. బస్సు బస్వాపూర్ చేరుతుండగా ఎదురుగా లారీ వేగంగా వస్తోంది. డ్రైవర్ దానిని తప్పించబోగా బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సు కుదుపేస్తూ ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును అదుపుచేయడంతో ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు నేషనల్ హైవే పనులు ఇష్టారాజ్యంగా చేస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.