calender_icon.png 28 April, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు తీర్చండి సారు..

28-04-2025 05:38:36 PM

ప్రజావాణిలో విజ్ఞప్తుల వెల్లువ...

మహబూబాబాద్ (విజయక్రాంతి): సమస్యలకు పరిష్కారం చూపి తగిన న్యాయం చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో(Additional Collector Lenin Vatsal Toppo)కు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. నెల్లికుదురు మండలం నరసింహుల గూడెం గ్రామానికి చెందిన ప్రజలు గ్రామంలో ఎ.ఎన్.ఎం. గా వైద్య సేవలు అందించిన కె. జ్యోతిని డిప్యుటేషన్ పై వేరే గ్రామానికి పంపివ్వడం జరిగిందని, ఆ ఎ.ఎన్.ఎం.ను తిరిగి తమ గ్రామంలోనే కొనసాగేలా చూడాలని కోరారు.

మహబూబాబాద్ వినియోగదారుల సంక్షేమ మండలి అధ్యక్షులు రేషన్ షాపుల ద్వారా తెల్ల కార్డు కలిగిన లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం సరైన తూకంతో అందించాలని కోరారు. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన దాసరి విజయ తన పేరు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాలో ఉన్నదని, అట్టి జాబితా నుండి తన పేరును తొలగించుటకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తనకు న్యాయం చేయాలని అదే విధంగా తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ 37 , మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ 6, డి.ఆర్.డి.ఓ 6, హౌసింగ్ డిపార్ట్మెంట్ 8 ఈ విధంగా వివిధ శాఖలకు సంబందించి ఈ రోజు ప్రజావాణిలో వచ్చిన 78 దరఖాస్తులను పరిష్కారం కొరకు సంబంధిత శాఖల అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి, సి.పి.ఓ సుబ్బారావు, డి.సి.ఓ వెంకటేశ్వర్లు, డి.హెచ్.ఎస్.ఓ మరియన్న, బి.సి, ఎస్.సి డెవలప్మెంట్ అధికారులు నరసింహా స్వామి, శ్రీనివాసరావు, గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్, జి.ఎం. ఇండస్ట్రీస్ శ్రీమన్నారాయణ, ట్రైబల్ వెల్ఫేర్ ఉపసంచాలకులు దేశీరాం, ఎంప్లాయ్ మెంట్ అధికారి రజిత, హౌసింగ్ అధికారి రాజయ్య, ఎల్.డి.ఎం సత్యనారాయణ మూర్తి, పెన్షన్ విభాగం అధికారి శంకర్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ పవన్ కుమార్, వివిధ మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.