calender_icon.png 7 February, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిన్నెరసాని కాలువలో ముసలి కలకలం

07-02-2025 08:40:27 PM

భయం గుప్పిట్లో ఆ ప్రాంత ప్రజలు..

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కెటిపిఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి, మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నుండి నీటిని తరలించే కాలువలో ఓ ముసలి శుక్రవారం కలకలం రేపింది. స్థానికుల, ప్రత్యేక్ష సాక్షుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కిన్నెరసానిలో గల రిజర్వాయర్ నుండి, పాల్వంచలో ఉన్న కెటిపిఎస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమయ్యే నీటిని ప్రత్యేకంగా దీని కోసమే తయారు చేసిన కాలువల ద్వారా తరలిస్తుంటూరు. అయితే శుక్రవారం కొంతమంది కాలువ వద్దకు తమ అవసరాలు తీర్చుకునేందుకు వెళ్లిన కిన్నెరసాని ప్రాంత ప్రజలకు కాలువలో ముసలి కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు.

విషయాన్నీ పక్కనే ఉన్న అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. పై అధికారుల సూచనల మేరకు కాలువలో ఉన్న ముసలిని కొంత మంది జాలరులు వల వేసి పట్టుకున్నారు. పట్టుకున్న ముసలిని అటవీ శాఖాదికారులు తిరిగి కిన్నెరసాని రిజర్వాయర్ లో వదిలి వేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సహజంగా అయితే కిన్నెరసాని ప్రాంతానికి చెందిన కొంతమంది తమ అవసరాల కోసం కాలువ వద్దకు వచ్చి, స్నానాలు చేసి, బట్టలు ఉతుక్కొని వెళుతుంటారు. అంతే కాకుండా పర్యాటకులు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు కూడ కాలువ వద్దకు చేరుకొని స్నానాలు చేస్తుంటారు. ముసలి ముందుగానే కనిపించటంతో సరిపోయింది, లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదొనని ప్రజలు అనుకుంటున్నారు.

అసలు కాలువలోకి ముసలి ఎలా వచ్చిందోనన్నా అనుమానలు తలెత్తుతున్నాయి. రిజర్వాయర్ నుండి కేటీపిఎస్ కు నీటిని వదిలే దగ్గర వాల్స్ ఉంటాయి. మరి ముసలి ఎలా నీటిలోకి వచ్చి ఉంటుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కిన్నెరసాని వద్దనే ముసలి కాలువలో కనిపించగా, గతంలో కరక వాగు గ్రామం వద్ద ఉన్న ఇదే కాలువలో కనిపించింది. ముసళ్ల ద్వారా పెను ప్రమాదం జరుగకముందే అసలు ఈ ముసళ్ళు కాలువల్లోకి ఎలా వస్తున్నాయో.. అన్నా విషయాన్ని తెలుసుకొని ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యటకులు సంబంధిత అధికారులను కోరారు.