calender_icon.png 23 December, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీడీఎస్ అక్రమ రవాణపె ఉక్కుపాదం

23-12-2024 12:50:27 AM

  1. రంగంలోకి విజిలెన్స్ బృందాలు 
  2. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేయాలని సర్కార్ ఆదేశం 
  3. నల్లగొండ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం తరలింపు
  4. పోలీసుల సహకారంతో యథేచ్ఛగా అక్రమ దందా!
  5. ఏటా 6లక్షల టన్నులు పక్క రాష్ట్రాలకు?

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో  పీడీఎస్ బియ్యం అక్రమ రవాణపై ఫౌరసరఫరాల శాఖ పటిష్ట నిఘా పెట్టింది. బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించి రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయాలని సర్కారు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఏటా 6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దళారుల ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్తోందని పౌరసరఫరాల శాఖ గుర్తించింది.

రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రారంభానికి ముందే అక్రమ రవాణాకు ముకుతాడు వేయాలని సూచనప్రా యంగా చెప్పడంతో.. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా నుంచి భారీగా పీడీఎస్ రైస్ కాకినాడ పోర్టుకు తరలించడంతో తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం పక్కదారి పడుతుందని స్పష్టమైంది.

ఇటీవలే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. పీడీఎస్ రైస్ బహిరంగ మార్కెట్‌కు వెళ్లడం లేదని, దళారీ వ్యవస్థను అరికట్టి దేశంలోనే పీడీఎస్ నియంత్రణలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నట్టు ప్రకటిం చారు. ఆయన ప్రకటన చేసిన 15 రోజుల్లోనే సొంత జిల్లాలో పీడీఎస్ రవాణా చేసే ముఠా గట్టు బయటపడింది.

10 మంది బ్రోకర్లను పోలీసులను అరెస్టు చేయగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దళారులకు సహకరించిన వారిలో 8 మంది పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్టు తేలింది. సీసీఎస్ అధికారుల విచారణలో ఖమ్మం, మెదక్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నట్టు గుర్తించారు. 

రెండు నెలల్లో కాకినాడ పోర్టుకు తెలంగాణ బియ్యం 1,300 క్వింటాళ్లు వచ్చినట్టు అక్కడి పోలీసులు పౌరసరఫరాల శాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండు, మూడు రోజుల్లో విజిలెన్స్ బృందాలు నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేపట్టనున్నట్టు సమాచారం. ముందుగా ఫిర్యాదులు వచ్చిన జిల్లాలో తనిఖీలు చేపట్టి అక్రమ రవాణాకు పాల్పడే వారితో పాటు వారికి సహకరించే డీలర్లు, పోలీసు అధికారుల భరతం పట్టనున్నట్టు తెలుస్తోంది. 

పీడీఎస్ అక్రమ రవాణాకు కట్టడి 

పేదలు దొడ్డు బియ్యం వినియోగించడంలేదని గుర్తించిన ప్రభుత్వం జనవరి నుంచి రేషన్‌కార్డుల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించింది. అప్పటిలోగా పీడీఎస్ రైస్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విజిలెన్స్‌ను రంగంలోకి దించినట్టు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.

లబ్ధిదారులు మూడు నెలల వరకు రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకోకుంటే వారి కార్డులను రద్దు చేసే నిబంధనలు కఠినం చేయనున్నట్టు ఆయన వివరించారు. నిజమైన పేదలు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని, బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు విక్రయించే అక్రమార్కులపై ఉక్కపాదం మోపుతామన్నారు.

రూ.8కి కొని రూ.30కి విక్రయం 

దళారులు పేదల నుంచి పీడీఎస్ రైస్‌ను రూ.8 నుంచి రూ.10కి కొనుగోలు చేసి, పక్కరాష్ట్రాలకు రూ.30కి విక్రయిస్తున్నారు. దీంట్లో అధికారులు, పోలీసులకు వాటాగా కిలోకు రూ.3 ఇస్తూ సరుకును తనిఖీ చేయకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారు. మరికొందరు బ్రోకర్లు స్థానికంగా ఉండే టిఫిన్ సెంటర్లు, హోటళ్లకు రూ.15 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నారు.

ప్రత్యేకంగా రోజువారీ కూలీలను ఏర్పాటు చేసుకుని వారికి కిలోకు రూ.2 ఇస్తూ వ్యాపారం దర్జాగా సాగిస్తున్నారు. పలుమార్లు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయడంతో ఇంటింటికీ తిరిగి బియ్యం సేకరించే కూలీలను మార్చుతూ జాగ్రత్త పడుతున్నారు. 

ఏటా 6లక్షల టన్నుల బియ్యం పక్కదారి 

రాష్ట్ర ప్రభుత్వం 89.90 రేషన్‌కార్డుల ద్వారా 2.81 కోట్ల మందికి నెలకు 2లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. ఈ క్రమంలో ఏడాదికి 24లక్షల టన్నుల బియ్యాన్ని రేషన్ దుకా ణాలకు సరఫరా చేసి ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పన పంపిణీ చేస్తుంది.

ఇందులో 5.50లక్షల రేషన్‌కార్డుదారులు బియ్యం తీసుకోకుండా డీలర్లకే తిరిగి అమ్ముతున్నట్టు గతంలో అధికారులు గుర్తించారు. వారంతా రేషన్ కార్డులను ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యశ్రీ కోసం తీసుకున్నట్టు వెల్లడైంది. దీంతో రాష్ట్రంలో ఏటా 6లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్టు స్పష్టమైంది.