02-03-2025 12:59:09 AM
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెం చగలమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. శనివారం గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.
గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని మైనింగ్ అధికారులు సీఎంకు వివరించారు. క్వారీల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై సీఎం కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వంలోని నీటి పారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలని సీఎం సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు.
గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సీఎం అధికారులను ప్ర శ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమ స్యను పరిష్కరించాలని ఆదేశించారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణరంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలన్నారు.
తక్కు వ ధరకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమార్కులను సంప్రదించరని చెప్పా రు. హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక వినియోగం ఎక్కువగా జరుగుతోందని సీఎం పేర్కొన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీజీఎండీసీ చైైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, సీఎం సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, కార్యదర్శి మాణిక్‌రాజ్, రాష్ర్ట గనుల శాఖ డైరెక్టర్ కే శశాంక, గనుల శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్, టీజీఎండీసీ ఎండీ సుశీల్‌కుమార్ పాల్గొన్నారు.
‘మామునూరు’ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎయిర్‌పోర్టుపై జూబ్లీహిల్స్‌లోని తమ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మామునూరు ఎయిర్‌పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.
ఎయిర్‌పోర్టు భూసేకరణ, పెం డింగ్ పనులకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంత రం సీఎం మాట్లాడుతూ.. కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్‌పోర్టు ఉండాలని సూచించారు. విమాన రాకపోకలతో పాటు ఇతర యాక్టివిటీస్ ఉండేలా, వరంగల్ నగరానికి ఎస్సెట్‌గా విమానాశ్రయ నిర్మాణం ఉండేలా చూడాలన్నారు.
ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ధన్యవాదాలు తెలిపారు.
సమీక్షలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాల్సిందే..
ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ర్టంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెం టర్లుగా (ఏటీసీ) అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై ఆరా తీశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలన్నారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్‌పై పూర్తిస్థాయి అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.