27-02-2025 02:05:21 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఎస్ ఎల్‌బీసీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ట్వీట్ చేశారు. ‘జీడిగింజ నల్లగున్నా నాకేటి సిగ్గు అన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహా రం ఉంది. బాధ్యతాయుత సీఎంగా ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై దృష్టి సారించ కుండా ఎన్నికలు, ఢిల్లీ టూర్‌లు అంటూ తిరిగే నీకు పాలన అంటే ఏంటో తెలుసా? ఎస్‌ఎల్‌బీసీ ఒక డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు.
అయినా పనులు ఆగిపోవడం వల్ల బేరింగ్‌లు పనిచేయడం లేదని అనడం ఏంటి? పనులు మొదలు పెట్టడానికి ముందు జీఎస్‌ఐ సర్వే ఏమైనా చేశారా? గుడ్డిగా కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారా? పనికిమాలిన లీకులు, అక్కరకు రాని చిట్‌చాట్లు దేనికి?” అంటూ పోస్ట్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన 14 నెలల పాలనలో 36 సార్లు ఢిల్లీ వెళ్లి 3 రూపాయలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. హస్తినా యాత్రలు మాని ఎస్‌ఎల్‌బీసీ కార్మికుల గోడు వినాలని.. బాధిత కుటుంబాలకు భరోసాని వ్వాలని డిమాండ్ చేశారు.
వెబ్‌సైట్ నుంచి రిపోర్టులను తొలగించడం, చేయని తప్పులకు అధికారులపై వేటు వేసినంత మాత్రాన, పదేళ్ల తెలంగాణ ముఖచిత్రాన్ని చెరిపేయడం ఈ సీఎం వల్లే కాదన్నారు. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్ట్‌తో బీఆర్‌ఎస్ దార్శనిక పాలనకు, కాంగ్రెస్ దద్దమ్మ పాలనకు ఉన్న స్పష్టమైందన్నారు. ఈ విషయం మింగుడుపడకే సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగంపై వేధింపులకు దిగుతున్నాడని ఆరోపించారు.
నియోజకవర్గాల పునర్వి భజనతో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను నిర్ణయిస్తే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 165 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు వెల్లడించారు.