28-03-2025 12:00:00 AM
పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్
నిజామాబాద్, మార్చి 27 (విజయ క్రాంతి): ఇటీవల నిజామాబాద్ జిల్లాలో జ్యుడిషరీ రిమాండ్లో చనిపోయిన అల్లకుంట సంపత్ మృతిపై విచారణ జరిపించాలని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిపించిన నిజనిర్ధారణ నివేదికను విడుదల చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన అల్లికుంట సంపత్ ను మార్చి 12న విచారణలో భాగంగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, మార్చి 13న సంపత్ ను జగిత్యాల తీసుకెళ్లి అతని ఆఫీస్ సోదా చేశారు. ఈ క్రమంలో సంపత్ అస్వస్థతత కు గురయ్యాడని, ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడనీ పోలీసులు చెప్పారని గుర్తు చేశారు. సంపత్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు ఉద్ఘాటించారు. సంపత్ మృతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం తోపాటు అతడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, జాయింట్ సెక్రెటరీ జలంధర్ డిఎస్పి జిల్లా అధ్యక్షుడు న్యాయవాది ఎడ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.