calender_icon.png 11 January, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలపై ప్రారంభమైన విచారణ..

10-01-2025 08:26:32 PM

ఉన్నతాధికారులతో కమిటీ వేసిన ప్రభుత్వం...

హాజరైన బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభమైనదని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. ఇటీవల ఎక్సైజ్  అధికారులపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ విచారణ కమిటీ వేసిందని, శుక్రవారం జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ నాగలక్ష్మి నేతృత్వంలో జరిగిన విచారణకు తాను హాజరైనట్లు వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో కమిటీ ముందు విచారణకు హాజరైన అనంతరం రాచాల మాట్లాడుతూ... ఎక్సైజ్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ, వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పని చేసిన ప్రభు వినయ్ లపై తాను చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగినట్లు తెలిపారు.

తాము చేసిన ఫిర్యాదులపై ఆధారాలతో సహా కమిటీకి అందజేసినట్లు వివరించారు. 20 ఏళ్లకు పైగా ఒకేచోట విధులు నిర్వహిస్తూ ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ సీనియారిటీ లిస్టులో తనకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను సిఫార్సు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని రాచాల ఆరోపించారు. అలాగే ఇటీవలే సస్పెండ్ అయిన వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ డేట్ ఆఫ్ బర్త్ ను 1964 కు బదులు 1969 మార్చుకొని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, దీనికి ఒమర్ సహకరించారని తెలిపారు. అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని రాచాల ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 15 న తదుపరి విచారణను హాజరు కావాలని అధికారులు కోరినట్లు రాచాల వివరించారు.