calender_icon.png 12 March, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెల్లువ

12-03-2025 12:00:00 AM

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు 

25 శాతం రిబేటు సదుపాయాన్ని వినియోగించుకోవాలని పిలుపు

నిజామాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): జిల్లాలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్.ఆర్.ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల (మార్చి) 31 లోపు పూర్తి స్థాయి ఎల్.ఆర్.ఎస్ ఫీజుతో పాటు ప్రో-రాటా ఓపెన్ స్పేస్ చార్జీలను చెల్లించే వారికి ప్రభుత్వం 25 శాతం రిబేటు వర్తింపజేస్తోందని గుర్తు చేశారు.

దీంతో దరఖాస్తుదారులు ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు స్వతహాగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు రిబేటును మినహాయిస్తూ, వెంటదివెంట ల్యాండ్ రెగ్యులరెజైషన్ కు సంబంధించిన ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతోందని కలెక్టర్ వివరించారు. దరఖాస్తుదారుల సౌకర్యార్ధం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయించామని, దరఖాస్తుదారులు సంప్రదించవచ్చని సూచించారు.

బఫర్, ఎఫ్.టి.ఎల్, చెరువులు, కుంటలు వంటి నిషేధిత జాబితాలోని ప్రాంతాలను మినహాయిస్తే, ఇతర ప్రాంతాలలోని ప్లాట్లకు ఆన్లున్ లో సులభంగా అనుమతి లభిస్తోందని అన్నారు. చెరువులు, నీటి వనరులకు సమీపంలో కనీసం 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అనుమతులు తప్పనిసరి అని కలెక్టర్ వెల్లడించారు.

ఎల్ ఆర్ ఎస్ అరత లేని స్థలాలపై చెల్లించిన ఫీజులలో 90% రిఫండ్ అవుతుందని, 10 శాతం ప్రాసెసింగ్ చార్జెస్ కింద తీసుకుంటారని అన్నారు . మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రిబేటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 25 శాతం రాయితీ పొందాలని కలెక్టర్ సూచించారు.