calender_icon.png 10 January, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలుపెరుగని అక్షరసైనికుడు

17-10-2024 12:00:00 AM

కామిడి సతీష్ రెడ్డి :

నేడు షోయబ్ ఉల్లాఖాన్ జయంతి

అతను ఒక అక్షర సేనాని, నిజాం నిరంకుశత్వంను తన కలం ద్వారా ఎండగట్టిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు. పాత్రికేయవృత్తికి వన్నె తెచ్చిన యోధుడు. నిఖార్సయిన వార్తల తో రజాకార్ల, నిజాం ఆగడాలను ప్రశ్నించి, విలువలు గల సంపాదకీయాలు రాసిన మేరునగ ధీరుడు షోయబ్ ఉల్లాఖాన్.  తెలంగాణా సాయుధ పోరాట యోధుడు.

బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. షోయబ్ ఉల్లాఖాన్ 1920, అక్టోబరు 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబుల్లా ఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు. తల్లి లాయహున్నీసా బేగం. షోయ బ్ ఉల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం. వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిం ది.

షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాల యం నుంచి బి.ఎ, జర్నలిజం డిగ్రీ చేశారు. బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యారు. తన కుమారునిలో మహాత్ముని పోలికలున్నాయని షోయబ్ తండ్రి మురిసిపోయే వాడు. ఈ కారణం చేతనే షోయబ్‌ను ఆయన ‘షోయబుల్లా గాంధీ’ అని ముద్దు గా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్ కూడా తాను నమ్మిన మార్గంలో ప్రయాణించడంలో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించారు. విశాలభావాలు కలవాడు,అభ్యుదయ వాది.

జీవితమంతా పత్రికా వృత్తిలోనే.. 

‘ఇమ్రోజ్’ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు షోయబ్‌ను  రజాకార్లు 1948, ఆగస్టు  22న పత్రికాకార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు. షోయబ్ ఉల్లాఖాన్ విద్య పూర్తిచేసుకున్నాక జీవితాన్నంతా పత్రికావృత్తిలో గడిపారు.

షోయ బ్ ఉల్లా రచనా జీవితం ‘తేజ్’ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ, ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించా రు. ఆ కారణంగా నిజాం ప్రభుత్వం ‘తేజ్’ పత్రికను నిషేధించింది. ఆ సమయంలోనే ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు ముందుము ల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న ‘రయ్యత్’ పత్రికలో ఉప సంపా దకునిగా బాధ్యతలు చేపట్టారు.

‘రయ్యత్’ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది. అప్పటికే ముమ్మ రంగా తెలంగాణా సాయుధ పోరాటం జరుగుతోంది. ఆ సందర్భంలో రయ్యత్ పత్రికలో నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతు న్న పద్ధతులను వ్యతిరేకిస్తూ రచనలు చేశా రు. ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది.

సొంత పత్రిక స్థాపన

‘రయ్యత్’ నిషేధానికి గురయ్యాకా షోయబ్ ఉల్లాఖాన్ స్వంత నిర్వహణలో ఇమ్రోజ్ అనే దినపత్రికను స్థాపించారు. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలుకూడా స్వీకరించారు. రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి. పాకిస్తాన్‌కు కోట్లాది రూపాయలు ధనసహాయం చేయడం వంటి చర్యలతో నిజాం, రాజ్యంలోని ప్రజలతో దాదాపుగా యుద్ధం చేస్తూ ఖాసిం రజ్వీ పరిస్థితుల్ని మార్చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు ఒక పత్రాన్ని తయారుచేశారు. హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే నిజాం రాజుకు, ఆయన ప్రజల కు సరైన నిర్ణయమని ఆ పత్రం సారాం శం. ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యథాతథంగా షోయబ్ ఉల్లాఖాన్ ప్రచురించారు.

ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం భయ పడ్డాడు. ఈ పరిణామాలే చివరకు ఆయన దారుణ హత్యకు కారణమయ్యాయి. షోయబ్ ఉల్లాఖాన్ హత్య జరిగేనాటికి ఆయనకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు.

షోయబ్ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. పునాదులు కోల్పోయిన ఆ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది. షోయబ్ తండ్రి నాలుగేళ్లపాటు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర ఆర్థి క సాయం పొంది తర్వాత ఆయనకూడా కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు.

నిజాం ఆగడాలపై యుద్ధం

కాంగ్రెస్ నాయకులు మందుముల నర్సింగరావు బావ అయిన బూర్గుల రామకృష్ణారావు తమ తరఫున నిజాం దౌర్జన్యాలను ఎండగట్టే ఒక పత్రిక ఉండాలని ఆరాటపడే వారు. షోయబ్ ఉల్లాఖాన్ బూర్గుల సహాయంతో నగలు,నట్రా అమ్మి ‘ఇమ్రోజ్’ను స్థాపించారు. బూర్గుల రామకృష్ణారావు ఇంట్లో ఇమ్రోజ్ ఆఫీస్ ఉండే ది. ఉర్దూలో ‘ఇమ్రోజ్’ అంటే ఈ రోజు. షోయబ్  దేన్నయినా గుడ్డిగా నమ్మేవారు కాదు.

చాలా తార్కిక దృష్టి. అందుకే సోవియట్ యూనియన్‌లో స్టాలిన్ నియం తృత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు. ప్రజాస్వామ్యంలేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. ఎమ్‌ఎన్ రాయ్ ‘రాడికల్ హ్యూమనిస్ట్’ పత్రికను తెప్పించుకునేవారు. ఆయన రాతలు చాలా సీరి యస్సే కానీ మనిషి మాత్రం సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. సైద్ధాంతిక చర్చలప్పుడు కూడా అనవసర ఘర్షణ లకు దిగేవారు కాదు.

చర్చను కూడా నెమ్మదిగా, నిలకడగా చేసేవారు. జర్దాపా న్, సిగరెట్ ఆయన అలవాట్లు. షోయబ్ ఉల్లాఖాన్ మంచి పెయింటర్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం.  ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసారు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టేవారు. ఏ మూల నిజాం ఆగడాలు చెలరేగుతున్నా, ఎక్కడ ఆర్మీ క్యాంప్స్ ఉన్నా వాటి గురించి నిర్భయంగా రాసేవారు.

హైదరాబాద్ ఇండి యాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో స్పష్టం చేసేవారు. నిజామ్‌కు వ్యతి రేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించేవారు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆవేద న చెందారు.

బలిదానానికి దక్కని గౌరవం

హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబ్ ఉల్లాఖాన్ కల. లక్ష్యం. దాని కోసం నడిరోడ్డుమీద ప్రాణాలను బలిపెట్టారు. అలాంటి త్యాగమూర్తికి మనమిచ్చిన గౌరవం... మలక్‌పేటలో ఆయన పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు. ఇంతే. చూద్దామంటే ఆయన విగ్రహం లేదు. తర్వాత తరాలు తెలుసుకోవడానికి చరిత్ర లేదు.

కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్.. ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించారు. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ 1948 ఆగస్టు 19 సభలో షోయబ్ చేతులు నరికివేస్తామన్నాడు. అన్నట్లుగానే మూడు రోజుల తర్వాత  కాచిగూడ రైల్వే స్టేషను రోడ్‌లో ముష్కరులు ఆయన వార్తలు రాసే కుడి అరచేతిని  నరికేశారు.

1948 ఆగస్టు 22న తెల్లవారుజామున షోయబ్ తుది శ్వాస విడిచారు. నిజాం సర్కార్ షోయబ్ అంతిమయాత్రను నిషేధించింది. అంతిమ యాత్ర పోలీసు పహరా మధ్య జరిగింది. గోషామహల్ మాలకుంట శ్మశా న వాటికలో ఆయన ఖననం జరిగింది. నేడు ప్రతీ రచయిత, పాత్రికేయుడు షోయ బ్ ఉల్లాఖాన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. అవినీతి, అక్రమాలు వెలికి తీయాలి. సమాజంలో పాత్రికేయ వృత్తి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలి.  

వ్యాసకర్త సెల్ : 9848445134