మోహన్ లాల్ టైటిల్ రోల్ పోషిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ ‘బరోజ్ 3డీ’. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానున్న నేపథ్యంలో మోహన్‌లాల్ సినిమా విశేషాలను పంచుకున్నారు. “బరోజ్’ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే బరోజ్‌లో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్‌గా సినిమాని రూపొందించాం.
సినిమా అద్భుతంగా వచ్చింది. ‘-గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్’ నవలను ఆధారంగా చేసుకొని ఒక ఇమాజనరీ అడ్వంచర్ కథను రూపొందించాం. వాస్కోడి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్తగా ఉంటుంది. -త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన కెమెరాలు అవసరం పడతాయి. అన్ని కెమెరాల విజన్ పర్ఫెక్ట్‌గా సింక్ అవ్వాలి. ప్రేక్షకుడికి గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
-ఈ సినిమాకు ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఇచ్చారు. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకు సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం. గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీనికోసం యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశాం. చాలా మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. వీళ్లందరితో కలిసి తొలిసారి ఓ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందాన్నిచ్చింది’ అని తెలిపారు మోహన్‌లాల్.